దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి.
వచ్చే జనవరి నుంచే..
బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి.
పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
లంచాల స్కామ్ ఎఫెక్ట్
టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment