jobs scam
-
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
Land-for-jobs case: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ల సన్నిహితుడు అమిత్ కట్యాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది. కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!
దేశంలో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ (TCS)లో ఉద్యోగాలకు లంచాల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వేతనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సిబ్బంది సంస్థలకు చేసే చెల్లింపుల్లో మార్పులు చేసింది. ఇలా చేయడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వచ్చే జనవరి నుంచే.. బిజినెస్ వార్తా సంస్థ ‘మింట్’ నివేదిక ప్రకారం.. టీసీఎస్ సవరించిన చెల్లింపు విధానం వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న వెండర్ (సిబ్బంది సంస్థ) ఒప్పందాలు ఈ ఏడాది డిసెంబర్ వరకూ అమలులో ఉంటాయి. కొత్త ఒప్పందాలు 2024 జనవరి నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు, వెండర్ ఖర్చులు, బీమా వంటివన్నీ కంపెనీ చెల్లింపుల్లోనే కలిసి ఉంటాయి. పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ధరల సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. మంచి అర్హత కలిగిన అభ్యర్థులకు కంపెనీని చేరువ చేయడం ద్వారా అటు సిబ్బంది సంస్థలు, ఇటు టీసీఎస్.. రెండింటికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రేట్ కార్డులలో చేస్తున్న మార్పు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగుల విషయంలో ఎటువంటి మార్పు లేదు. టీసీఎస్ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండటం గమనార్హం. లంచాల స్కామ్ ఎఫెక్ట్ టీసీఎస్ నియామక ప్రక్రియలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ధరల విధానాలలో ఈ సర్దుబాటు చేసింది. కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ నియామక సంస్థల నుంచి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెలుగులోకి రావడంతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో టీసీఎస్ విచారణ చేపట్టింది. ఫలితంగా కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ హెడ్ ఈఎస్ చక్రవర్తితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అలాగే ఆరు సిబ్బంది సంస్థలను బ్లాక్ లిస్ట్ చేసింది. -
TCS Recruitment Scam: లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) 16 మందిపై వేటు వేసింది. వారిని విధుల నుంచి తొలగించింది. కంపెనీతో వ్యాపారం సాగిస్తున్న ఆరుగురు విక్రేతలపై నిషేధం విధించింది. లంచాలు తీసుకుంటూ ఉద్యోగాలు ఇస్తున్నారనే స్కామ్‌లో వీరి పాత్ర ఉన్నట్లు సంస్థ గుర్తించింది. జూన్ 23న ప్రారంభమైన విచారణ నివేదిక ప్రకారం వీరిపై చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మొత్తం 19 మంది ఉద్యోగులు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం అయినట్లు టీసీఎస్ తెలిపింది. అయితే వీరిలో 16 మందిని తొలగించారు. మరో ముగ్గురిని సంస్థ రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి బదిలీ చేసింది. దాంతోపాటు ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున డబ్బు ముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారానే ఈ సమాచారం బయటకు వచ్చింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొన్నేళ్లుగా సిబ్బంది నియామకాలకు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు కమీషన్ల ద్వారా దాదాపు రూ.100 కోట్లు సంపాదించవచ్చని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు లేఖలు అందాయి. దాంతో ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ..జూన్ 23న సమగ్ర విచారణకు కమిటీని నియమించింది. సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కాంతో కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కుంభకోణంలో మేనేజర్ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు వెల్లడించింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ సంస్థ నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజేషన్, రిసోర్స్ అలోకేషన్ గ్రూప్ ద్వారా 55 దేశాల్లో దాదాపు 6లక్షల మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, వర్క్‌ఫ్రంహోంకు స్వస్తి పలికినట్లు టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ గతంలో ఆఫర్ లెటర్లు ప్రకటించిన వారిని తప్పకుండా ఉద్యోగంలోకి తీసుకుంటుందని చెప్పింది. -
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్‌ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్‌కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
సాక్షి ఎడిటర్‌కు ‘కాంబోడియా’ బాధితుల కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తాము స్వదేశానికి రావడంలో ‘సాక్షి’చూపిన చొరవ మరువలేని దని ‘కాంబోడియా’బాధితులు అన్నారు. గురువారం కరీంనగర్‌కు చెందిన యువకులు సలీం, షారుఖ్, షాభాజ్, హాజీ హైదరాబాద్ లోని ‘సాక్షి’ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ వర్ధెల్లి మురళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం కాంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో చిక్కిన తాము తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. అయితే సాక్షి దినపత్రిక వరుస కథనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించేలా చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కాంబోడియాలో సైబర్ నేరస్తుల ముఠా తమను ఎలా హింసించిందన్న విషయాలను వారు ఎడిటర్‌కు వివరించారు. సెప్టెంబర్ 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన కరీంనగర్ యువకులు కాంబోడియాలో చిక్కుకున్న విషయాన్ని ‘సాక్షి‘బయట పెట్టిన విషయం తెలిసిందే. తర్వాత కూడా సాక్షి ప్రచురించిన వరుస కథనాలతో స్పందించిన కరీంనగర్ పోలీసులు, స్థానిక ఎంపీ సంజయ్ చొరవ తీసుకుని ఆ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. (క్లిక్: ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం) -
మాదాపూర్‌లో హైటెక్ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ధన్యోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది. ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
ఆందోళనలతో అట్టుడుకుతున్న రామగుండం
-
ఎస్ఎస్ఏ పోస్టుల భర్తీలో టీడీపీ నేతల మాయాజాలం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయంటారు పెద్దలు. అది నిజమని తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో మరోసారి తేలిపోయింది. అప్పటికి అధికారం చేతిలో ఉంది కదా అని కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీలో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా లక్షల రూపాయలు మింగేశారు. అధికారానికి చివరి ఘడియల్లో ఉన్న సమయంలో నాలుగేళ్ల క్రితం.. 2019లో ఈ అవినీతి బాగోతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు. నాటి పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు ఇటీవల అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల బండారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయంలో నాటి ఫైళ్లను సీజ్ చేశారు. దీంతో నాడు పోస్టుల భర్తీలో చక్రం తిప్పిన అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పోస్టుల మాయాజాలం వివరాలివీ.. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏకి అప్పగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏలో ఖాళీగా ఉన్న 2,600 పైగా పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 400 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వీటిలో అన్ని కేటగిరీలకూ చెందిన 242 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఇండియన్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ, ఎస్ఎస్ఏ అధికారులు కీలక పాత్ర పోషించారు. భారీ పోటీయే అవకాశంగా.. మార్కులు, రోస్టర్ పాయింట్లు, కులం ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మార్గదర్శకాలతో ఉద్యోగ నియామకానికి సమగ్ర శిక్ష అధికారులు ప్రకటన విడుదల చేశారు. పోస్టును బట్టి రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం ఉండటంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంట్రాక్టు పోస్టులే అయినప్పటికీ ప్రభుత్వంలో పని చేసిన సర్వీసు రికార్డు, ఎప్పుడైనా క్రమబద్ధీకరిస్తారనే ఆశతో మొత్తం 242 పోస్టులకు 3 వేల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు నలుగురైదుగురి వరకూ పోటీ పడ్డారు. ఇదే అదనుగా తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. కాకినాడ ఎస్ఎస్ఏ కార్యాలయంలో చక్రం తిప్పిన ఉద్యోగులతో కుమ్మక్కై లక్షల రూపాయలు దిగమింగి పోస్టింగులు ఇచ్చేశారు. పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసి మింగేశారు. తెలుగు తమ్ముళ్లే తెర వెనుక ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపించడంతో అప్పట్లో పెదవి విప్పేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అయితే ఆ పాపం పండే రోజు రానే వచ్చింది. అనర్హులకు కూడా పోస్టింగులు ఇవ్వడంతో కడుపు మండిన అర్హుల్లో పలువురు ఈ బాగోతంపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నాటి పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల క్రితమే కాకినాడలోని ఎస్ఎస్ఏ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నాడు జరిగిన పోస్టుల భర్తీ ప్రక్రియ, నియమితులైన వారి విద్యార్హతలు తదితర వివరాలు సేకరిస్తున్నారు. నాటి ముఖ్య ప్రజాప్రతినిధి ప్రమేయం! కాకినాడకు చెందిన అప్పటి టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి, కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో ఔట్సోర్సింగ్ వ్యవహారాలను చక్కబెట్టిన, నాడు టీడీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు తెర వెనుక ఉండి ఈ బాగోతాన్ని నడిపించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు చక్రం తిప్పారనే కోణంలో విచారణ సాగుతోంది. పోస్టులను పంచేసుకుని ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసిన ఉద్యోగులు ఎవరు, వారిలో ఎవరి పాత్ర ఎంత, వారికి సహకరించిన బయటి వ్యక్తులు ఎవరనే వివరాలను ఏసీబీ సేకరిస్తోంది. అర్హతల ఆధారంగా రోస్టర్ పాయింట్లు లేకపోవడం, లేని విద్యార్హతలు సృష్టించి పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడటం వంటివి జరిగాయని చెబుతున్నారు. ఈ పరిణామంతో నాడు పోస్టుల భర్తీలో తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్ అయిన అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు నాలుగైదు పోస్టుల వంతున పంచేసుకుని.. రూ.లక్షలు దిగమింగిన విషయం ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. -
ఆ స్కాంలో బీజేపీ ఎంపీ కుమార్తె అరెస్ట్
గువహటి : 2016లో జరిగిన అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీఎస్సీ) పరీక్షలో సమాధాన పత్రాలతో వారి చేతిరాత సరిపోలకపోవడంతో బీజేపీ ఎంపీ ఆర్పీ శర్మ కుమార్తె పల్లవి సహా 19 మంది అస్సాం అధికారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీఎస్సీలో ఉద్యోగాల కొనుగోలు కుంభకోణాన్ని విచారిస్తున్న దిబ్రూగర్ పోలీసులు అస్సాం సివిల్ సర్వీస్, అస్సాం పోలీస్ సర్వీస్, ఇతర ప్రభుత్వ అధికారులు 19 మందికి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి ఆన్సర్ షీట్లు, వీరి చేతిరాత ఒకేరకంగా లేదని గుర్తించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల ఆధారంగా వీరిని గువహటిలో అరెస్ట్ చేశామని దిబ్రూగర్ ఎస్పీ గౌతం బోరా తెలిపారు. ఏపీఎస్సీ పరీక్షల అనంతరం రాకేష్ పాల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ 19 మంది అధికారులు ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎంపికయ్యారు. ఈ కుంభకోణంలో పాల్ సహా మరో ముగ్గురు అధికారులను గతంలో అరెస్ట్ చేశారు. కాగా, ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయిన 13 మంది అధికారులను అస్సాం ప్రభుత్వం జూన్ 21న ఉద్యోగాల నుంచి తొలగించింది. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా : ఐదుగురు అరెస్ట్
అనంతపురం: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను ఘరానా మోసం చేసిన ఓ ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..అనంతపురంలో కొందరు కౌన్సిల్ ఫర్ ఆగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (సీఏఈఎఫ్‌ఎం) అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు చెందిన ఎన్ జ్యోతి ప్రసాద్‌రెడ్డి (ఛైర్మన్), సాధీక్వలీ (జీఎం), ఎం. కృష్ణ (సీఈఓ) కలిసి పంగల్రోడ్డుని టీటీడీసీలో 2015 జనవరిలో మరో సంస్థను స్థాపించారు. అప్పట్లో సుమారు 324 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు జరిపి వారి నుండి ఒక్కొక్కరితో రూ. 25 వేల నుండి రూ. 60 వేల వరకు రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. కొంతమందికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉద్యోగులతో రైతులకు అవగాహన కార్యక్రమాలను రెండు నెలల పాటు నిర్వహించారు. తరువాత ఆ సంస్థలోని ఉద్యోగులు వేతనాలు చెల్లించాలంటూ సంస్థ యజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆరు నెలలు తరువాత మోసపోయిన బాధితులు మూడవ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొన్నప్పటికి ఈ మోసగాళ్లు వెనుక అధికారపార్టీ నాయకులు ఉండడంతో పోలీసులను దర్యాప్తుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే మోసపోయిన నిరుద్యోగులు పోలీసులను నిలదీయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ జ్యోతిప్రసాద్ రెడ్డి... చిత్తూరు జిల్లాకు చెందిన జ్యోతిప్రసాద్రెడ్డికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి కుటుంబ సభ్యులతో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. జ్యోతిప్రసాద్రెడ్డి ఇప్పటికే ముగ్గురిని వివాహాం చేసుకుని నిత్యం మోసాలకు పాల్పడుతూ.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓ మంత్రి వద్ద తలదాచుకుంటున్నట్టు బాధితులు చెప్పుతున్నారు. అయితే పోలీసులు అసలు ముద్దాయిలను వదిలిపెట్టి ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంపై పలు విమర్శలకు దారితీస్తోంది.