విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు ఖరారు
ప్రకటించిన సమన్వయ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే నిర్ణయించిన వేతనాల పెంపుతో పాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అదనంగా ప్రకటించిన వెయ్యి రూపాయల నజరానా కూడా ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 23 వేల మంది విద్యుత్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ‘ఆర్టిజన్ ఉద్యోగులు’గా గుర్తించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు ఏజెన్సీలతో సంబంధం లేకుండా నేరుగా జీతాలు చెల్లించే విషయంలో సుముఖత వ్యక్తం చేసింది.
మిగతా అంశాలకు సంబంధించి తుది తీర్పు రానుంది. ఈలోగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన జీతాలను ఖరారు చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సమన్వయ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ రెగ్యులర్ ఉద్యోగులకు లభించే గౌరవం, కనీస వేతన చట్టం కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన వేతన విధానం ప్రకారం.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను 4 కేటగిరీలుగా విభజించారు.
► గ్రేడ్ 1: హైలీ స్కిల్డ్ (అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారు– ఇంజనీరింగ్, డిప్లొమా, విద్యార్హతలు కలిగిన వారు)
► గ్రేడ్ 2: స్కిల్డ్ (నైపుణ్యం కలిగిన వారు– డిగ్రీ విద్యార్హత కలిగిన వారు)
► గ్రేడ్ 3: సెమీ స్కిల్డ్ (మాధ్యమిక నైపుణ్యం కలిగిన వారు– ఇంటర్ విద్యార్హత)
► గ్రేడ్ 4: అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని వారు– పదోతరగతి విద్యార్హత) గ్రేడ్‌ల పరంగా వేతనాలిలా..
అన్‌స్కిల్స్ ఉద్యోగులకు: రూ.2,215 నుంచి రూ. 2,500 వరకు వేతనాలు పెంచారు. పెంచిన జీతాన్ని జూలై 29 నుంచి చెల్లిస్తారు. పీఎఫ్, ఈ ఎస్‌ఐ వాటాధనం గతంలో మాదిరిగానే వేతనాల్లో భాగంగా ఉంటాయి. గ్రేడ్ 1 ఉద్యోగులకు జీతాలు రూ. 20,785 నుంచి రూ.23,000కు పెరిగాయి. గ్రేడ్ 2 ఉద్యోగుల జీతాలు రూ.16,663 నుంచి రూ.19,000కు పెరిగాయి. గ్రేడ్ 3 ఉద్యోగుల జీతాలు రూ.13,576 నుంచి రూ.16,000కు పెరిగాయి. గ్రేడ్ 4 ఉద్యోగుల జీతాలు రూ. 11,500 నుంచి రూ.14,000కు పెరిగాయి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అందరికీ ప్రతి నెలా 1న బ్యాంకు అకౌంట్‌లో జీతాలు వేస్తారు. 4 సంస్థల్లో ఇప్పటి వరకున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు అన్నింటినీ రద్దు చేశారు. ఇదివరకులాగే విద్యుత్ సంస్థలు, ఆర్టిజన్ ఉద్యోగులు సం యుక్తంగా భవిష్య నిధికి డబ్బులు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని వేతనాల్లోంచి తీసి ప్రావిడెంట్ ఫండ్ కు జమచేస్తారు. ఈఎస్‌ఐకి చెల్లించే డబ్బులు కూడా సంస్థలు, ఉద్యోగులు సంయుక్తంగా చెల్లిస్తారు.