జూలై 21 నుంచి కరెంటోళ్ల సమ్మె! | Electric Contract Workers protest on July 21st | Sakshi
Sakshi News home page

జూలై 21 నుంచి కరెంటోళ్ల సమ్మె!

Published Thu, Jun 7 2018 1:00 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

Electric Contract Workers protest on July 21st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జూలై 21 నుంచి లేదా ఆ తర్వాత ఏ క్షణమైనా రాష్ట్ర విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు (ఆర్టిజన్లు) నిరవధిక సమ్మెకు దిగుతారని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సమ్మె నోటీసులు జారీ చేసింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రధా న కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించిన అనంతరం సంస్థ సీఎండీ రఘుమా రెడ్డికి యూనియన్‌ నేతలు సమ్మె నోటీసు అందించారు. 2015లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు 13 విద్యుత్‌ కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ట్రేడ్‌ యూనియన్ల ఫ్రంట్‌ పేర్కొంది. సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెబాట పడతారన్నారు. 16 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఈ 4 సంస్థల యాజమాన్యాలకు అందజేశామని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు.  

ప్రధాన డిమాండ్లు..
- విద్యుత్‌ సంస్థల్లో కాంట్రాక్ట్‌ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల అమలుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ కేసు విషయంలో ప్రభుత్వం తక్షణమే కౌంటర్‌ దాఖలు చేసి కార్మికులను విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలి.  
- కార్మికుల విలీన సమయంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న వేతన శ్రేణిని అమలు చేయాలి.  
- 2018 పీఆర్సీతో పాటు 24గీ7 విద్యుత్‌ సరఫరా ఇంక్రిమెంట్‌ను ఆర్టిజన్లకు వర్తింపజేయాలి.  
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్టిజన్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.  
- రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా కార్మికులకు మెడికల్‌ క్రెడిట్‌ కార్డు సదుపాయం కల్పించాలి. 
- చనిపోయిన ఆర్టిజన్‌ కార్మికుల వారసులకు కారు ణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించాలి. 
- ఆర్టిజన్‌ కార్మికులు చనిపోతే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement