సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తలెత్తిన వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. అలా కుదరని పక్షంలో తామే పూర్తిస్థాయిలో వాదనలు విని నిర్ణయం వెలువరిస్తామని చెప్పి తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వా ల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విభజన నిమిత్తం తెలంగాణ విద్యుత్ సంస్థ లు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ 1,260 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏపీ స్థానికత ఆధారంగా రిలీవ్ చేసిన ఉద్యోగుల జీతభత్యాలను 58:42 నిష్పత్తిలో ఉభయ రాష్ట్రాలు చెల్లించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తుది విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ ప్రారంభించిన జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
స్థానికత ఆధారంగా పక్కన పెట్టిన 1,200 మంది ఉద్యోగుల్లో అసలు ఎంతమంది ఏపీకి వెళ్లాలనుకుంటున్నారు.. ఎంతమంది తెలంగాణలో ఉండదలిచారో తెలుసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం గత విచారణ సమయంలో ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఆప్షన్ల వివరాలను ధర్మాసనం ముందుంచారు. 596 మంది ఏపీకి, 501 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని ఆయన తెలిపారు. 22 మంది ఆప్షన్లు ఇవ్వలేదని, మరో ఐదు మంది ఆప్షన్లు అవసరంలేదని చెప్పారని ఆయన వివరించారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ వాదనలు వినిపిస్తూ, సామరస్యపూర్వక పరిష్కారంపై వైఖరి తెలిపేందుకు తమకు మరో రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment