- ఆందోళనలో కాంట్రాక్టు సిబ్బంది
- కాలపరిమితి నెలాఖరు వరకు
- ఇన్నేళ్ల చాకిరీకి ఇదేనా గుర్తింపు
- కొనసాగించాలని వినతి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి నెలాఖరుతో ముగియనుండడంతో సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. తెలంగాణలో వీరిని పర్మినెంట్ చేస్తామని చెబుతుంటే సీమాంధ్రలో మాత్రం తొలగి స్తామనడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయని వైనం తెలిసిందే. పలు ప్రభుత్వశాఖలు ఔట్‌సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి.
కనీస వేతనానికి నోచుకోకున్నా, నెలల తరబడి జీతాలు అందకపోయినా అంకిత భావంతో పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగి స్తామనడం అన్యాయమని వాపోతున్నారు. ఎప్పటికైనా తమను రెగ్యులర్ చేయకపోతారా అన్న ఆశతో కొనసాగుతున్నారు. వీరికి సెలవులు, ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి అదనపు ప్రయోజనాలు లేవు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారన్న నెపంతో ప్రభుత్వం 2006 నుంచి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 150 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, క్లాస్-4 ఉద్యోగులు పనిచేస్తున్నారు. విశాఖ నగరంలోని డ్వామా, డీఆర్‌డీఏ, బీసీ సంక్షేమశాఖ, సాంఘికసంక్షేమశాఖ, జిల్లా మహిళా,శిశు అభివృద్ధిసంస్థ, బీసీ,ఎస్సీ కార్పొరేషన్‌తో పాటుగా వుడా,జీవీఎంసీ తదితర సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంతోమంది పనిచేస్తున్నారు.
అలాగే, సంక్షేమ హాస్టళ్లలో వాచ్‌మన్,కుక్,కమాటీలుగా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరంతా చాలీచాలని వేతనాలు, నెలల తరబడి చెల్లించకపోవడం వంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాస్-4 ఉద్యోగులకు రూ. 6,700లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.9,500 వంతున చెల్లిస్తోంది.
పలు శాఖల్లో వీరు రోజూ రాత్రివరకు కూడా పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఔట్‌సోర్సిగ్ సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. తమను కొనసాగించాలంటూ వీరు మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి జూన్30వరకు పొడిగిస్తూ ఏప్రిల్‌లో 84వ నంబర్ జీవో జారీ అయింది. తెలుగుదేశం ప్రభుత్వం వీరిని కరుణిస్తోందో ఇంటికి పంపుతుందో చూడాలి.