డిశ్చార్జ్‌ కార్డు మారింది..పసిప్రాణం పోయింది | discharge card change baby died | Sakshi
Sakshi News home page

డిశ్చార్జ్‌ కార్డు మారింది..పసిప్రాణం పోయింది

Published Wed, Jun 14 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

డిశ్చార్జ్‌ కార్డు మారింది..పసిప్రాణం పోయింది

డిశ్చార్జ్‌ కార్డు మారింది..పసిప్రాణం పోయింది

–పెద్దాసుపత్రిలో దారుణం
–జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన పాప తల్లిదండ్రులు
 
కర్నూలు(హాస్పిటల్‌): ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇచ్చే డిశ్చార్జ్‌ కార్డు మారిపోయింది. ఒకరికి ఇవ్వాల్సిన చికిత్సను మరొకరికి రాసివ్వడంతో ఆ మందులు వాడి ఓ పసిపాప ప్రాణం కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ తల్లిదండ్రులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయమై ఆరు వారాల్లోపు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరికీ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన రామమద్ది, లక్ష్మిదేవికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక్కతే కూతురు బి.అనూష(8నెలలు). ఈ పాపకు గత ఫిబ్రవరి 20వ తేదిన దగ్గు, ఆయాసం రావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నపిల్లల విభాగంలో వైద్యులు పరిశీలించి అడ్మిషన్‌ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం పాపకు ఆరోగ్యం కుదుట పడటంతో మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్‌ చేశారు.
 
అయితే ఆ సమయంలో అనూష పేరుతో ఇవ్వాల్సిన డిశ్చార్జ్‌ కార్డును ఎండి ఇబ్రహీం(18 నెలలు) అనే చిన్నారిది ఇచ్చారు. ఈ బాలుడు ఇదే చిన్నపిల్లల విభాగంలో వాంతులు, విరేచనాలతో ఫిబ్రవరి 27వ తేదిన అడ్మిషన్‌(ఐపీ నెం.11490) పొంది మార్చి ఒకటో తేదిన డిశ్చార్జ్‌ అయ్యాడు. ఇద్దరూ ఒకేరోజు డిశ్చార్జ్‌ కావడంతో ఒకరి డిశ్చార్జ్‌ కార్డు మరొకరికి ఇచ్చారు. అనూషకు ఇచ్చిన డిశ్చార్జ్‌ కార్డులో దగ్గు, ఆయాసం తగ్గే మందులు కాకుండా వాంతులు, విరేచనాలు తగ్గే మందులు ఇచ్చారు. అనూష తండ్రి రామమద్ది ఈ విషయం తెలియక మందులు తీసుకుని ఇంటికి వెళ్లి పాపకు వాడుతూ వచ్చాడు.
 
నాలుగు రోజుల తర్వాత పాపకు తిరిగి ఆయాసం పెరిగి.. మార్చి 7వ తేదిన రాత్రి గళ్ల ఎక్కువగా పడటం, విరేచనాలు అధికంగా కావడంతో భయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ పాప అదే నెల 11వ తేదీన మృతిచెందింది. డిశ్చార్జ్‌ సమయంలో ఇతర బాలుని మందులు తమ పాపకు రాయడం, వాటిని వాడటం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. ఈ మేరకు వారు ఇటీవల జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. స్పందించిన హక్కుల కమిషన్‌ ఆరు వారాల్లో తమకు నివేదిక అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరికి నోటీసులు జారీ చేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement