చిన్నారికి ప్రాణం పోశారు
చిన్నారికి ప్రాణం పోశారు
Published Tue, Nov 15 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
- పుట్టుకతోనే అతుక్కున్న అన్నవాహిక, శ్వాసకోశ నాళాలు
– పాలు కూడా తాగలేని దయనీయ స్థితి
– ఆపరేషన్ ద్వారా ఊపిరి పోసిన వైద్యులు
– పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు (హాస్పిటల్): పుట్టుకతోనే ఆ చిన్నారికి అన్నవాహిక, శ్వాసకోశ నాళాలు అతుక్కుని జన్మించింది. దీంతో పాలు తాగినా అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి పొరపోయి ప్రాణం పోసే పరిస్థితి. ఆరు నెలల పాటు చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ప్రముఖ ఆసుపత్రులన్నీ తిరిగారు. చివరకు పెద్దాసుపత్రికి రావడంతో వైద్యులు గుర్తించి ఆపరేషన్ ద్వారా ప్రాణం పోశారు.
సంజామల మండలం ఆకుమళ్ల గ్రామానికి చెందిన మోహన్, లక్ష్మీదేవి దంపతులకు ఆరు నెలల క్రితం జహీర్ జన్మించాడు. బాబుకు పుట్టుకతోనే అన్నవాహిక, శ్వాసనాళం కలయికతోనే జన్మించాడు. ఆరు నెలల పాటు ఆ శిశువును ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులకు చూపించినా సమస్యను గుర్తించలేకపోయారు. గత నెల 10వ తేదీన బాబును తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగానికి తీసుకొచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగాచార్యులైన డాక్టర్ జె.వీరాస్వామి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ జి. చలపతి, డాక్టర్ కె. నరసింహరావు, డాక్టర్ జీబీ రమణ పరిశీలించారు. అన్ని రకాల పరీక్షలు చేసి బాబుకు పుట్టుకతోనే అన్నవాహిక, శ్వాసనాళం కలిసి ఉన్నట్లు గుర్తించారు. గత నెల 22వ తేదీన తమతో పాటు అనెస్తెటిస్ట్ డాక్టర్ అనిత కలిసి ఆ బాబుకు ఆపరేషన్ ద్వారా మూడు గంటల పాటు శ్రమించి అన్నవాహిక, శ్వాసనాళం వేరుచేశారు. బాబు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వీరాస్వామి, డాక్టర్ చలపతి మాట్లాడుతూ ఇలాంటి వ్యాధిని వైద్యపరిభాషలో హెచ్ టైప్ ఆఫ్ ట్రాకీ ఓసోఫోగల్ ఫిస్టులా అంటారని తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేయకపోతే ఈ శిశువు ఊపిరితిత్తుల్లోకి క్షయం చేరి చెడిపోతాయన్నారు. ఈ రకమైన వైకల్యం 80వేల మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సను చేయడం రాయలసీమలోనే ఇదే మొదటిసారన్నారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒక శిశువు చిన్న బ్యాటరీని మింగిన తర్వాత అన్నవాహిక, శ్వాసనాళం కలిసి పోయిందన్నారు. దీనివల్ల బిడ్డకు శ్వాసకోశంలో క్షయంతో ఈ ఆసుపత్రిలోనే చేరిందని తెలిపారు. ఈ బిడ్డకు వ్యాధిని గుర్తించి తగిన శస్త్రచికిత్స చేశామన్నారు.
Advertisement
Advertisement