ప్రాణ సహాయం | Child Saved In Karnataka With Social media Croud Funding | Sakshi
Sakshi News home page

ప్రాణ సహాయం

Published Tue, Aug 14 2018 1:28 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Child Saved In Karnataka With Social media Croud Funding - Sakshi

ఆస్పత్రిలో చిన్నారి రాచెల్‌తో తల్లి మయూరి ముంగ్‌కుంగ్‌

నిరుపేద ఒంటరి మహిళ. సొంతూరు వేలాది మైళ్ల ఆవల. చిన్నారి కూతురికి ప్రాణాంతక జబ్బు. చేతిలో నయాపైసా లేదు. బిడ్డను కాపాడుకోవడానికి వారినీ వీరినీ అర్థించింది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న ఒక టెక్కీ సోషల్‌ మీడియా ద్వారా నిధుల సేకరణకు నడుం బిగించాడు. ఎంతోమంది దాతలు స్పందించడంతో పాప ఆరోగ్యవంతురాలైంది.

బొమ్మనహళ్లి: సోషల్‌ మీడియా అంటే రెండువైపులా పదునున్న కత్తి వంటిది. మంచికి ఉపయోగించవచ్చు. లేదా ఇంకో రకంగానూ వాడుకోవచ్చు.  మాటలు కూడా రాని చిన్నారిని మృత్యువు నుంచి రక్షించడంలో సోషల్‌ మీడియా ఇతోధికంగా సాయపడింది.  మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన మయూరి ముంగ్‌కుంగ్‌కు భర్త విడాకులు ఇవ్వడంతో పది నెలల కూతురు రాచెల్‌తో జీవనోపాధి వెతుక్కుంటూ బెంగళూరు నగరానికి వచ్చింది. ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ వచ్చే చిరు ఆదాయంతో పది నెలల కుమార్తెతో జీవిస్తోంది.  అంతా సవ్యంగా సాగుతున్న మయూరిపై విధి పగబట్టింది. కొద్ది రోజులుగా చిన్నారి అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చూపించగా తీవ్రమైన శ్వాసకోశ జబ్బుతో బాధపడుతోందని, వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయకపోతే పాప దక్కకపోవచ్చని వైద్యులు చెప్పిన మాటలతో మయూరి నిశ్చేష్టురాలైంది. శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు అవసరమవుతాయని తెలిపారు. 

టెక్కీ ఆపన్నహస్తం  
ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి కట్టుకున్న భర్త, తల్లిదండ్రులు, తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో ఆమె తాను పని చేస్తున్న ఇళ్ల యజమానులకు మొరపెట్టుకుంది. విషయం తెలుసుకున్న బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీ ఐటీ ఇంజినీరు, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన గిరీశ్‌ ఆళ్వా నడుం బిగించారు. స్నేహితులకు, తోటి ఉద్యోగులకు పాప పరిస్థితి వివరించి మిలాప్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌ ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రారంభించారు. ట్విట్టర్‌లో కూడా సేవ్‌ రాచెల్‌ట్యాగ్‌లైన్‌తో నిధుల సమీకరణకు ఉపక్రమించారు. అన్ని వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. గిరీశ్‌ ప్రకటనకు దాతలు వేగంగా స్పందించడంతో కేవలం 24 గంటల్లో రూ.1.70 లక్షల నిధులు సమకూరాయి.

శస్త్రచికిత్సతో కొత్త జీవితం  
దాతల నుంచి వచ్చిన నిధులతో గిరీశ్‌ అతడి స్నేహితులు రాచెల్‌కు శస్త్రచికిత్స చేయించడంతో చిన్నారి మృత్యుఒడి నుంచి తప్పించుకొని తల్లి మయూరి ఒడికి చేరుకుంది. శస్త్రచికిత్స జరిగిన రోజు నుంచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే వరకు ప్రతి రోజూ సమాచారాన్ని గిరీశ్‌ ట్విట్టర్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా శస్త్రచికిత్స జరిగిన రోజు నుంచి అప్పుడప్పుడు గిరీశ్‌ తన స్నేహితులతో కలసి రాచెల్‌ను పరామర్శిస్తూ చిన్నారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. 

మణిపూర్‌ సీఎం అభినందలు  
సోషల్‌ మీడియా, టీవీల ద్వారా సమాచారం అందుకున్న తెలుసుకున్న మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ కూడా రాచెల్‌కు సహాయం చేసిన గిరీశ్‌కు ఫోన్‌ చేసి ప్రశంసించారు. రాచెల్‌కు ఆసుపత్రి ఖర్చులతో పాటు  ఆమె తల్లి మయూరి తిరిగి సొంతూరు రావడానికి  రూ.30 వేల ఆర్థిక సహాయం సీఎం అందించారు. దీంతో ఈనెలాఖరున వారు మణిపూర్‌కి వెళ్లిపోనున్నారు.  అక్కడే మయూరికి ఉండడానికి ఇల్లు, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని గిరీశ్‌ సీఎం బీరేన్‌సింగ్‌కు విన్నవించారు. రాచెల్‌ను కాపాడడానికి గిరీశ్‌ అతని స్నేహితులు పడిన శ్రమను గుర్తించి మణిపాల్‌ ఆసుపత్రి బిల్లులో రూ.20 వేల మినహాయింపునిచ్చింది. 

జీవితాంతం సంతోషం  
‘ప్రస్తుతం సమాజంలో సోషల్‌ మీడియా అత్యంత ప్రభావిత, శక్తివంతమైన ఆయుధాలు. వాటిని మంచికోసం ఉపయోగించుకుంటే ఎంతోమంది ప్రాణాలు రక్షించవచ్చు. మరెన్నో అద్భుతాలు చేయవచ్చు.ఈ క్రమంలో మేము చేసిన ప్రయత్నం ఓ చిన్నారి ప్రాణాలు రక్షించామనే సంతృప్తి జీవితాంతం సంతోషాన్నిస్తుంది’. – గిరీశ్‌ ఆళ్వా, ఐటీ ఇంజనీర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement