ఆ.. పిల్లలే కదా! | .. Is that children! | Sakshi
Sakshi News home page

ఆ.. పిల్లలే కదా!

Published Sat, Nov 12 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

.. Is that children!

చిన్నారులకు అరకొర వైద్యం
– పెద్దాసుపత్రిలో వైద్యుల కొరత
– పడకలు 80.. చిన్నారులు 200లకు పైగానే..
– పోస్టులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం
- సహనాన్ని పరీక్షిస్తున్న పరికరాలు
- విమర్శలకు తావిస్తున్న ప్రభుత్వ తీరు
 
 
అప్పుడే జన్మించిన శిశువు మొదలు.. 12 ఏళ్ల పిల్లల వరకు చికిత్స పొందే పెద్దాసుపత్రి చిన్న పిల్లల విభాగంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. వైద్యులు.. పారా మెడికల్‌ సిబ్బంది నియామకం చేపట్టకపోవడం చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. పడకలకు మించి చిన్నారులు ఆసుపత్రిలో చేరుతున్నా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదే సమయంలో ఇక్కడున్న వైద్య పరికరాలు కూడా వైద్యుల సహనాన్ని పరీక్షిస్తుండటం గమనార్హం.
 
కర్నూలు(హాస్పిటల్‌):
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇందులో నాల్గవ యూనిట్‌ను ఎంసీఐ తనిఖీలకు ఏర్పాటు చేసుకున్నా ప్రభుత్వం నుంచి అనుమతి రాని పరిస్థితి. మొత్తం మూడు యూనిట్లకు కలిపి మూడు ప్రొఫెసర్‌, రెండు అసోసియేట్, ఏడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం రెండు ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ప్రతిరోజూ ఓపీకి 300 మందికి పైగానే చిన్నపిల్లలు చికిత్స కోసం వస్తారు. అందులో రోజూ 30 నుంచి 40 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్‌ చేస్తారు. ప్రతి యూనిట్‌కు 20 పడకలు చొప్పున నాలుగు యూనిట్లకు 80 పడకలు ఉండగా.. ఇక్కడ చేరే చిన్నపిల్లలు మాత్రం 200 వందలకు పైగానే ఉంటున్నారు.
 
అనుమతిలేని ఎన్‌ఎస్‌యూఐ, పీఐసీయూ
చిన్నపిల్లల విభాగంలో ఇన్సెంటివ్‌ కేర్‌ చికిత్స కోసం ఏర్పాటు చేసిన పీఐసీయూకు, ఏడాదిలోపు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌యూఐలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అనుమతివ్వలేదు. ఇక్కడ వైద్యులు, పారా మెడికల్, సిబ్బంది పోస్టులనూ మంజూరు చేయలేదు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ విభాగం వైద్యులే ఇక్కడా సేవలందిస్తున్నారు. ఎన్‌ఐసీయూలో ముగ్గురు వైద్యులు, 50 మంది సిస్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడి వైద్య పరికరాలు సైతం పాతబడిపోయి వైద్యుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
 
ఎస్‌సీఎన్‌యూలోనూ ఇదే పరిస్థితి
నవజాత శిశువుల ఆరోగ్యం కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ నిధులతో ఏర్పాటు చేసిన ఎస్‌సీఎన్‌యూలోనూ వైద్యుల కొరత వేధిస్తోంది. ఇక్కడ ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో చిన్నపిల్లల విభాగం వైద్యులే ఇక్కడా సేవలందిస్తున్నారు. ఇక్కడ 20 పడకలు మంజూరు కాగా నిత్యం 50 నుంచి 60 మంది చిన్నారులు చికిత్స అందుకుంటారు. ఈ కారణంగా ఒక ఇంక్యుబేటర్, వార్మర్లలో ఇద్దరు, ముగ్గురు శిశువులకు చికిత్స అందించాల్సి వస్తోంది.
 
మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం
చిన్నపిల్లల విభాగంలో అవసరమైనంత వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని, అవసరమైన పరికరాలు పంపాలని మూడేళ్లుగా ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా లేదు. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా వైద్యులు ఎంతో సహనంతో సేవ చేస్తున్నారు.
–డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement