ప్రభుత్వాస్పత్రి సిబ్బందా.. మజాకా!
ప్రభుత్వాస్పత్రి సిబ్బందా.. మజాకా!
Published Tue, Sep 12 2017 9:44 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- పోస్టుమార్టం చేయకుండానే మృతదేహం అప్పగింత
- తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలంటూ ఫోన్
- ఒక రోజు ఆలస్యంగా అంత్యక్రియలు
- వైద్య సిబ్బంది తీరుపై బంధువుల ఆగ్రహం
ఆస్పరి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండానే బంధువులకు అప్పగించి తర్వాత దాన్ని తిరిగి తెప్పించిన కర్నూలు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై తీవస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈనెల 6న ఆస్పరికి చెందిన రాళ్లదొడ్డి మాబుసాబ్ పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మాబుసాబ్‌ను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కొలుకోలేక సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో వైద్యులు మాబుసాబ్ మృతి చెందినట్లు రశీదు ఇచ్చి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. అనంతరం వారు మృతదేహాన్ని ఆస్పరికి తీసుకొచ్చారు. సమాచారం తెలియడంతో కడచూపు కోసంబంధువులందరూ వచ్చారు.
అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా..
అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రి నుంచి మాబుసాబ్ బంధువులకు ఫోన్ వచ్చింది. ‘నాన్ ఎంఎల్‌సీ కేసు అనుకుని మీకు మృతదేహాన్ని అప్పజెప్పాం. అది ఎంఎల్‌సీ కేసు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలి తిరిగి కర్నూలుకు తీసుకురండి. వెంటనే పోస్టుమార్టం చేసి పంపుతాం’ అంటూ వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అయితే ప్రభుత్వాస్పత్రి సిబ్బంది మంగళవారం పోస్టుమార్టం చేసి మృతేదేహాన్ని అప్పగించారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు ఒక రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరారు.
Advertisement
Advertisement