అనాథ పిల్లల కోసం ‘ఊయల’
కర్నూలు(హాస్పిటల్): అనాథ పిల్లల కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగాన్ని సందర్శించారు. పీఐసీయులో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను భారంగా భావించేవారు వారిని ఆసుపత్రిలోని ఊయలలో పడుకోబెట్టి వెళ్లవచ్చన్నారు. వారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూలో సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నపిల్లల విభాగానికి అదనంగా 10 ఏసీలు, 40 పడకలు అవసరం ఉందన్నారు. మందుల కొరత తీవ్రంగా ఉందని, ఈ విషయాలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు లేకుండా మాతాశిశు భవనాన్ని ఎందుకు ప్రారంభించారని, దీనిపై ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తానన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ అరుణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఏఆర్‌ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.