ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోగల లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన అనంతరం ఆస్పత్రికి సంబంధించిన పలు లోపాలు బయటపడ్డాయి.
లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరినీ అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం అమర్చారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో ఆ సేఫ్టీ అలారం మోగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వార్డులో పొగలు వ్యాపించడాన్ని గమనించినవారు కేకలు వేయడంతో ప్రమాదాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. సేఫ్టీ అలారం మోగి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా జరిగేదని స్థానికులు అంటున్నారు.
నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది కూడా లోనికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వారు వార్డు కిటికీ అద్దాలను పగులగొట్టి, లోపలికి చేరుకుని మంటలను అదుపు చేస్తూనే, శిశువులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.
ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ లోపల, మరొకటి వెలుపల ఉంది. ముందుగా అగ్నిమాపక సిబ్బంది బయట ఉన్న వార్డులోని నవజాత శిశువులను వెలుపలికి తీసుకువచ్చారు. ఇంతలోనే మంటలు లోపలి వార్డులోకి ప్రవేశించడంతో అక్కడున్న పిల్లలు తీవ్రంగా కాలిపోయారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఝాన్సీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 16 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఎస్‌ఎస్పీ సుధా సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment