అనంతపురం మెడికల్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ–లైబ్రరీ గది నుంచి పొగలు వచ్చాయి. భవనం బయట ఉన్న కొందరు ఉద్యోగులు గుర్తించి 100, 101కు సమాచారం ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ సాయంతో మెయిన్ ఆఫ్ చేసేశారు. అంతలోనే భోజన విరామం ముగించుకుని వచ్చిన అసిస్టెంట్ లైబ్రేరియన్ విషయాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. ఐదు నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ గదిలో కంప్యూటర్లు ఉండడంతో నీటిని వాడకుండా రసాయనాలు వాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీ వద్ద నుంచి మంటలు వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వైరింగ్ మొత్తం కాలిపోయింది. సకాలంలో గుర్తించడంతో ప్రమాద తీవ్రతను అరికట్టగలిగారు. ప్రమాదం గురించి ప్రిన్సిపల్ వెంటనే డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తినష్టం వివరాలను అధికారుల నుంచి తీసుకుని ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ప్రాథమికంగా రూ.2 లక్షల వరకు నష్టం జరిగి ఉండొచ్చని నిర్ధారణకు వచ్చారు.
మెడికల్ కళాశాలలో అగ్ని ప్రమాదం
Published Wed, Dec 28 2016 10:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement