పెద్ద ఆసుపత్రి భవనం నుంచి పడి ఇద్దరికి గాయాలు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనంపై నుంచి పడి ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రమాదానికి లోనై వారూ ఆసుపత్రి పాలయ్యారు. వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న స్వామిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాడు. ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లో ఉన్న మొదటి అంతస్తులో ఆయనను వైద్యులు ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు చిన్నత్త వెంకటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి గురువారం పేయింగ్ బ్లాక్‌కు వచ్చింది. స్వామిరెడ్డి భార్య స్వర్ణలతతో మాట్లాడుతూ గదిలోని బాల్కనికి చేరుకుంది. బాల్కనికి ఉన్న గ్రిల్‌కు ఆనుకుని మాట్లాడుతుండగా అప్పటికే తుప్పు పట్టిన గ్రిల్ కాస్తా విరిగిపోయింది. వెంటనే ఇద్దరూ అదుపు తప్పి కిందపడ్డారు. కుటుంబసభ్యులు స్పందించి చికిత్స నిమిత్తం క్యాజువాలిటీకి తరలించారు. వెంకటేశ్వరమ్మకు కాలు, చేయి విరగ్గా, స్వర్ణలతకు వెన్నుపూసకు గాయమయ్యింది. వీరికి ఎక్స్‌రే, సిటిస్కాన్ తీయించి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గ్రిల్ విరిగి తమ వారు కింద పడి గాయాల పాలయ్యారని కుటుంబసభ్యులు ఆరోపించారు.