శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధిలోకి ప్రవేశించాడు నల్ల సత్యం. అప్పుడు సాయంకాలం ఆరు కావొచ్చింది. వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వీధిలో అంతా ధనవంతులే. పెద్దపెద్ద మేడల్లో నివాసం ఉంటారు. కార్లలో తిరుగుతుంటారు. నడిచే జనం చాలా తక్కువ. పట్టపగలు కూడా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.నల్ల సత్యం గేదెను తోలుకెళ్లడం చూశారు వీధి మొదట్లో ఉన్న ఆటోవాలాలు.‘‘ఏంది సత్యం, రేచలమ్మగారికి పాలు పొయ్యడానికా?’’ అని అడిగాడు జానీ.‘‘ఔనన్నా..! ఇప్పటికే ఆలస్యం అయింది’’ అన్నాడు సత్యం.‘‘ఏం తిప్పలు సత్యం? మీ ఇంటి దగ్గరే పాలు పిండి తీసుకెళ్లి పోయవచ్చుగా! గేదెను తోలుకెళ్లి ఆవిడగారి ముందు పిండాలా?’’ అన్నాడు జానీ నవ్వుతూ.‘‘ఇంటి దగ్గర పిండి తీసుకెళ్తే రేచలమ్మ ఒప్పుకోదు. తను చూస్తుండగా పిండాలంటుంది’’ అన్నాడు సత్యం.నల్ల సత్యం రేచల్ ఇంటి గేటు తీసుకుని గేదెను లోపలకి తోలుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎంతకీ తలుపు తెరుచుకోలేదు.‘‘అమ్మగారూ! అమ్మగారూ..!’’ అని తలుపు తట్టాడు.ఎవరూ పలకలేదు. నల్ల సత్యం తలుపు నెట్టాడు. బార్లా తెరుచుకుంది. ‘‘అమ్మగారూ.. అమ్మగారూ..!’’ అని పిలుస్తూ ఇంట్లోకి వెళ్లాడు సత్యం. ఎవరూ పలకడం లేదు.‘ఎవరూ లేరా ఏంది?’ అనుకుంటూ బెడ్‌రూమ్ తలుపు నెట్టాడు. తలుపు తెరుచుకుంది. ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు పెట్టాడు. రేచల్ నేల మీద నెత్తురు మడుగులో చచ్చిపడుంది.సత్యం రోడ్డు మీదకు పరిగెత్తాడు. ‘‘అమ్మగార్ని చంపేశారు’’ అంటూ అరవసాగాడు.
శ్యామలానగర్ ఎనిమిదో నంబర్ వీధి జనంతో నిండింది. రేచల్ చనిపోయిందని తెలిసి గుంటూరులో ఉన్న బంధుమిత్రులు చాలామంది వచ్చారు. ఆమె భర్త విలియమ్స్ చర్చిఫాస్టర్ కావడంతో పరిచయస్తులు ఎక్కువే. వాళ్లకి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. విలియమ్స్, రేచల్ మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉంది శ్యామలానగర్. రేచల్ హత్యవార్త తెలియగానే ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ తన సిబ్బందితో చేరుకున్నాడు.రేచల్‌ని ఎవరో కత్తితో పొడిచి చంపారు. బీరువా అంతా వెతికినట్టు చిందరవందరగా పడిన దుస్తులు, వస్తువులను బట్టి తెలిసింది. బీరువాలో డబ్బు ఎక్కువ లేదు. పదివేలు పోయి ఉండొచ్చునన్నాడు విలియమ్స్. బంగారు నగలు ఏమీలేవు ఇంట్లో. అంతా లాకర్‌లో పెట్టామని కూడా చెప్పాడు.రేచల్, విలియమ్స్ దంపతులు ఒంటరిగా ఉంటున్నట్లు కనిపెట్టిన దొంగలు ప్లాన్డ్‌గా వచ్చారు. కానీ అనుకున్నంత ఏమీ దొరకలేదు. అనవసరంగా నిండు ప్రాణం తీశారు దుర్మార్గులు అని వాపోయారంతా.రేచల్‌కి అరవై ఏళ్లున్నా చాలా ఆరోగ్యంగా ఉంది. పని మనిషిని కూడా పెట్టుకోదు. ఇంటి పని అంతా తనే స్వయంగా చేసుకుంటుంది. గార్డెనింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కాంపౌండ్‌లో ఉన్న మొక్కలే ఆ విషయం చెబుతాయి.‘‘రేచల్‌కి డెయిరీ మిల్క్ అంటే ఇష్టం ఉండదు. వెన్న తీసిన పాలు రుచిగా ఉండవంటుంది. ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ మిల్క్‌నే ఇష్టపడుతుంది. నల్ల సత్యం ఇంటికొచ్చి గేదె పాలు పిండి పోస్తాడు’’ అని పోలీసులకు చెప్పాడు విలియమ్స్. రేచల్ శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు పోలీసులు.
‘‘సార్! రేచల్ హత్య డబ్బు, నగలు దొరుకుతాయని దొంగలు చేశారని నాకు అనిపించడం లేదు’’ అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఎస్సై రంగనాథ్. ‘‘ఇంకెవరు చేసి ఉంటారు? ఆమె భర్త ఫాస్టర్. ఆయనకు శత్రువులు ఉంటారా?’’అన్నాడు ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్.‘‘ఎందుకుండరు సార్? ఆయనేమైనా అజాతశత్రువా? నేరాలు డబ్బు కోసం, ఆడవాళ్ల వ్యవహారంలో, ఆస్తుల తగాదాల వల్ల ఎక్కువగా జరుగుతాయి కదా సార్!’’ అన్నాడు రంగనాథ్.ప్రవీణ్, రంగనాథ్‌లు వెళ్లేసరికి విలియమ్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లో బంధువులున్నారు. విలియమ్స్ వాళ్లని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.‘‘విలియమ్స్ గారూ! చెప్పండి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అంటే మీ భార్యను హత్య చేసేంత పగబట్టిన వాళ్లు?’’ అడిగాడు ప్రవీణ్.విలియమ్స్ తల అడ్డంగా ఊపాడు.‘‘లేదండీ! మాకు శత్రువులు ఎవరు ఉంటారు?’’ అన్నాడు.‘‘శత్రువులు బయట ఎక్కడో ఉంటారనుకోవద్దు సార్! ఇంట్లో కూడా ఉంటారు. ఈ మధ్య మీ ఆస్తి పంపకాలు జరిగాయనీ, కొడుకు, కోడళ్ల మధ్య ఘర్షణలు జరిగాయని మా ఎంక్వైరీలో తేలింది. ఆ వివరాలు చెప్తారా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.విలియమ్స్ ఇన్‌స్పెక్టర్‌వైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘‘ఇన్‌స్పెక్టర్ గారూ! నాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆల్‌ఫ్రెడ్ డాక్టర్. గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో సర్జన్. రెండోవాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బెంగళూరులో ఉన్నాడు. మీరన్నది నిజమే. నాకు గుంటూరు హిందూ కాలేజీ వెనుక అగ్రహారంలో ఓ పాత బిల్డింగ్ ఉంది. వెయ్యి గజాల్లో చిన్నచిన్న కొట్లున్న బిల్డింగ్ అది. ఆస్తులు పంచుతున్నప్పుడు ఆ బిల్డింగ్ తనకు రాసివ్వమన్నాడు పెద్దోడు. తను డాక్టర్ కనుక ఆ బిల్డింగ్ పడగొట్టి హాస్పిటల్ కడతానన్నాడు. చిన్నోడిని రెంటచింతలలో ఉన్న పది ఎకరాల పొలం తీసుకోమన్నాడు. అయితే చిన్నోడి భార్య అడ్డం తిరిగింది. బిల్డింగ్‌లో సగం, పొలంలో సగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఆమె తరఫు బంధువులు కూడా నన్ను అలా చేయడం న్యాయమని బలవంతపెట్టారు. నా భార్య మాత్రం పెద్దోడికి బిల్డింగ్ ఇవ్వడమే న్యాయం అంది. రెండో కోడలు జెస్సీ నా భార్యతో పోట్లాడింది. జెస్సీకి ఆవేశం ఎక్కువే! ‘అంతు తేలుస్తాను’ వంటి మాటలు వాడింది’’ చెప్పాడు విలియమ్స్.
‘‘చివరికి ఎలా పరిష్కారం చేశారు?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘నేను చెప్పినట్టు బిల్డింగ్ పెద్దోడికి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఆస్తి పంచడం కుదరదు. మేమే మా ఇష్టం వచ్చినట్లు విల్లు రాసి, మా తదనంతరం చెందేట్టుగా రిజిస్టర్ చేస్తాం’’ అని రేచల్ బెదిరించింది. ‘‘ఆ తర్వాత ఏం జరిగింది?’’‘‘ఆల్‌ఫ్రెడ్ తమ్ముడికి నచ్చజెప్పాడు. మీరు ఇప్పట్లో గుంటూరు రారు. బెంగళూరులో స్థిరపడతారు. ఇక్కడ ఆస్తి ఉన్నా మీకేం ఉపయోగం? నాకైతే ఉపయోగం. కావాలంటే రేటు కట్టి సగం క్యాష్ ఇస్తా. పొలం చెరి సగం పంచుకుందామన్నాడు. హెన్రీ కూడా అన్న మాట విన్నాడు. ఆ బిల్డింగ్ ఆల్‌ఫ్రెడ్‌కి రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘ఇదంతా మీ చిన్న కోడలు జెస్సీకి నచ్చని వ్యవహారం. దీనికి వత్తాసు పలికిన అత్త మీద ఆమెకు కోపం ఉండి ఉంటుంది కదా?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.‘‘కోపం ఉంటే ఉంటుంది కానీ అత్తను చంపేంత ఉందని అనుకోను’’ అని నిట్టూర్చాడు విలియమ్స్.‘‘అయితే దొంగలు చేసిన హత్యే అని నమ్ముతున్నారా?’’‘‘నా నమ్మకంతో పనేముంది? నేరస్తుడిని ఆ జీసస్ బయటపెడతాడు’’ అని విలియమ్స్ దేవుణ్ని తలుచుకున్నాడు.‘‘మీకు ఒక కూతురు కూడా ఉంది కదా? ఆమెకు ఆస్తిలో భాగం ఇవ్వలేదా?’’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్.‘‘మా అమ్మాయి పెళ్లిలో అల్లుడికి పది లక్షలు కట్నంగా ఇచ్చాం. ఇప్పుడు మేమున్న ఈ ఇల్లు మా తదనంతరం అమ్మాయికే అని విల్లు రాసిచ్చాం’’ చెప్పాడు విలియమ్స్.‘‘మీ అల్లుడు ఏం జాబ్ చేస్తాడు?’’‘‘మా అల్లుడు చార్లెస్ బీటెక్ చదివాడు. జాబ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. ఏదో బిజినెస్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఏటుకూరు రోడ్డులో జిన్నింగ్ మిల్లును లీజుకు తీసుకొని నడుపుతున్నాడు’’ చెప్పాడు విలియమ్స్.
జనరల్ హాస్పిటల్ నుంచి ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కి పిలుపు వచ్చింది. సూపరింటెండెంట్ ఒకసారి కలుసుకోమన్నారు. ప్రవీణ్ వెళ్లి ఆయన్ని కలిశాడు. ‘‘ఇన్‌స్పెక్టర్ గారూ! రేచల్ బాడీ పోస్ట్‌మార్టమ్ చేస్తున్నప్పుడు ఆమె కుడిచెయ్యి గుప్పిట మూసుకొని ఉంది. మీరెవరూ గమనించి ఉండరు. డాక్టర్లు తెరిచి చూస్తే, ఈ రింగ్ బయటపడింది’’ పోస్‌మార్టమ్ రిపోర్టుతో పాటు ఆ ఉంగరాన్ని ఇచ్చాడు హాస్పిటల్ సూపరింటెండెంట్.ఇన్‌స్పెక్టర్ దాన్ని తీసుకున్నాడు. నవరత్నాలు పొదిగిన ఉంగరం అది . ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయల్దేరాడు ఇన్‌స్పెక్టర్.నవరత్నాలు పొదిగిన ఉంగరం చూడగానే విలియమ్స్ ఆశ్చర్యపోయాడు. ‘‘ఇన్‌స్పెక్టర్! మీకు ఈ రింగ్ ఎక్కడిది?’’ అడిగాడు విలియమ్స్.‘‘చెప్పండి! ఈ ఉంగరం ఎవరిది?’’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్.‘‘ఈ రింగ్ మా అల్లుడు చార్లెస్‌ది’’ అన్నాడు. చార్లెస్‌ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చారు.‘‘మిస్టర్ చార్లెస్! మీ అత్త రేచల్‌ని ఎందుకు మర్డర్ చేశారు?’’ కఠినంగా ధ్వనించింది ప్రవీణ్ కంఠం. ‘‘మా అత్తను నేను మర్డర్ చేశానా? నో.. సార్!... నో.. నేను చెయ్యలేదు’’ వెలవెలపోతున్న ముఖంతో చెప్పాడు చార్లెస్.‘‘మమ్మల్ని బుకాయించకండి. మీ అత్తను మీరే చంపారు. కత్తితో పొడిచారు. ఆ పెనుగులాటలో మీ ఉంగరం ఆమె చేతిలోకి వచ్చింది. మీరు అది గమనించలేదు. ఎక్కడో జారిపోయిందని అనుకున్నారు. ఆ హత్య దొంగలు చేశారని అనుకోవాలని బీరువాలో డబ్బు తీసుకొని బట్టలను చిందరవందరగా పడేశారు’’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్.చార్లెస్ ఉంగరం వైపు చూశాడు. తర్వాత తలవంచుకొని చెప్పసాగాడు.
‘‘సార్! మా అత్త మాకు చాలా అన్యాయం చేసింది. ఆమెకు కొడుకుల మీదనే ప్రేమ. కూతురు పరాయిది. పది లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం? ఇంకేంది మీకిచ్చేది అని వాదించింది. న్యాయానికి ఇప్పుడు ఆస్తిలో కూతురికి కూడా భాగం ఇవ్వాలి. అందుకు ఆమె ఒప్పుకోలేదు. మా మామ ఆ బిల్డింగ్‌ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. నా భార్యకు కూడా ఇచ్చి ఉంటే, పెద్ద బామ్మర్ది మా భాగానికి వెలకట్టి డబ్బు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు క్యాష్ చాలా అవసరం. బిజినెస్‌కి పెట్టుబడి కావాలి. అది ఇవ్వకుండా అడ్డుపడింది మా అత్తే. చివరికి మా మామ తాము ఉంటున్న ఇల్లును తదనంతరం నా భార్యకు రాశారు. తదనంతరం అంటే ఎప్పుడు? వాళ్లు పోయాక? ఇప్పట్లో పోతారా? ఏ ఇరవై ఏళ్ల తర్వాత సంగతి. అప్పుడు మాకేం ఉపయోగం. అందుకే మా అత్తను చంపాను. మా మామకు తర్వాత నచ్చజెప్పి అమ్మేయాలని ప్లాన్ వేశాను’’ చెప్పాడు చార్లెస్.‘‘చార్లెస్! మీకు అన్యాయం జరిగిందని పిల్లనిచ్చిన అత్తను చంపుతారా? ఘోరం కాదా? కోర్టుకి వెళ్లి న్యాయం పొందాల్సింది. హత్యలు పరిష్కారం కావు?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.
చార్లెస్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.‘‘నవరత్నాలు అదృష్టం తెచ్చిపెడతాయని నమ్ముకున్నావు. కానీ అవే నిన్ను జైలుపాలు చేశాయి’’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్.
- వాణిశ్రీ
నవరత్నాలు
Published Sun, Apr 22 2018 12:51 AM | Last Updated on Sun, Apr 22 2018 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment