కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య విధాన పరిషత్ విజిలెన్స్ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ, మౌలిక సౌకర్యాల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగం, క్యాజువాలిటీ, మందుల సబ్ స్టోర్స్, మెటర్నిటీ లేబర్ వార్డు, మెటర్నిటీ వార్డును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాలకు చెందిన పత్తి లక్ష్మి అనే గర్భిణిని వైద్యసిబ్బంది పనితీరు, అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వ పథకాల గురించి అడిగారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అయితే ఎన్ని డబ్బులు ఇస్తారో తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథాకాలకు సంబంధించిన వాటి గురించి సిబ్బందిని ప్రశ్నించగా వాటి గురించి తెలియదని చెప్పారు. వైద్య సిబ్బందికే అవగాహన లేకపోతే ప్రజలకు ఎలా వివరిస్తారని, ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఓపీ విభాగంలో ఔట్ పేషెంట్లకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని రెఫరల్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాల రిజిస్టర్‌ను గురించి ప్రశ్నించారు. రిజిస్టర్ చూపించడంలో అందులో ఈ వివరాలు లేకపోవడంతో మండిపడ్డారు. కనీసం రాత్రి వాడిన మందుల వివరాలు ఎక్కడ రాశారో చెప్పాలని కోరగా వాటి వివరాలు రిజిస్టర్‌లో వెతుకుతూ కాలయాపన చేశారు.
మందుల స్టోర్ ఎక్కడుందని అడిగి ఫ్రీజ్‌ను తనిఖీ చేశారు. ఫ్రీజ్‌లో 361 నెంబర్‌తో ప్లడ్ శాంపిల్ ఉండగా, దానికి సంబంధించిన వివరాలు అడిగితే సిబ్బంది సమాధానం చెప్పలేదు. ప్రైవేటు ఆస్పత్రికి సంబంధించిన శాంపిల్ ఇక్కడ భద్రపర్చినట్లు తెలుస్తోంది. మూతలు ఓపెన్ చేసిన, సగం వరకు మాత్రమే వాడిన మందులు ఉండటాన్ని గమనించి ఎందుకు ఇలా ఉంచారని, ఖర్చుతో కూడిన విలువైన మందులు వృథా చేయడంపై వివరణ కోరారు. ఫ్రీజర్‌లో ఎక్స్‌పైరీ అరుున మందులు ఉండటంపై వివరణ ఇవ్వాలని కోరారు. లక్షల రూపాయల విలువైన మందులు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, నర్సులు బాధ్యతగా పనిచేయడం లేదని, అందుకు ఆర్‌ఎంఓ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోందని, హోటల్ నిర్వహణ ఇంతకంటే బాగా ఉంటుందని సిబ్బందిని హోటల్ సర్వర్‌తో పోల్చారు. సబ్ స్టోర్‌లో స్టాక్ రిజిస్టర్‌లో ఎక్కడా ఆర్‌ఎంఓ సంతకం లేదని, స్టోర్స్‌ను తనిఖీ చేసిన దాఖలాలు కనిపించడం లేదని మండిపడ్డారు.
మూడు నెలల నుంచి స్టోర్స్‌లో రికార్డులు రాయకపోతే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎవరి పనులు వారు చేసుకోవాలని బాధ్యత మరిచి ప్రవ ర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డులోని టాయిలెట్స్‌ను పరిశీలించి రూ.10 బల్బు పెట్టలేని దుస్థితిలో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర ఖర్చుల కోసం లక్షల నిధులు ఉన్నా వాటిని వాడుకోవడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది పనితీరు, వసతుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణలో పూర్తిగా లోపం కనిపిస్తోందన్నారు.
ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని, ఓపీలో కీలకమైన రిజిస్టర్ లేదని పనిష్‌మెంట్ కంటే సమస్య పరి ష్కారం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు. సిబ్బం ది కొరత ఉంద ని, డ్రైనేజీ నిర్మా ణం సరిగ్గా లేదని, పారిశుధ్యం మరింత మెరుగుపడాలన్నారు. త్వరలోనే మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభం అవుతుందన్నారు. దీంతో సిబ్బంది కొరత తీరి మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర ఖర్చుల కోసం రూ.28 లక్షల 72 వేల నిధులు ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు
Published Sat, Jun 13 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement
Advertisement