కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు.
భవనంపై నుంచి కింద పడి..
Published Fri, Jan 13 2017 11:12 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
యువకుడి మృతి
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని న్యూ శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సుంకన్న గౌండా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు నల్లబోతుల సురేష్(21) నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజిలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో గతంలో సెంట్రింగ్ పనికి వెళ్లేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనితో పాటు ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న గైనకాలజీ విభాగం(ఎంసీహెచ్ భవనం)లో ఐదో అంతస్తు నిర్మాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అందరూ పని ముగించుకుని కిందకు దిగారు. చీకటి పడటంతో సురేష్ సైతం కిందకు దిగే ప్రయత్నం చేస్తుండగా అదుపు తప్పి ఐదో అంతస్తు నుంచి కిందకు పడ్డాడు. వెంటనే తలపగలి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. కాలేజికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో మేనమామ ఊరికి వెళ్తానని సురేష్ చెప్పినా ఈ రోజు ఒక్కరోజు వెళ్లిరా అని తాను పంపించడంతోనే పనికి వచ్చి ఇలా మృత్యువుపాలయ్యాడని తల్లి శ్యామలమ్మ కన్నీటి పర్యంతమైంది. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సౌకర్యాలు కల్పించక పోవడంతో యువకుడు చీకట్లో కాలు జారి కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటల సమయంలో చీకటి పడటం, లైట్లు ఏర్పాటు చేకపోవడంతో ప్రమాదం జరిగింది.
Advertisement
Advertisement