దాతలచే పెద్దాసుపత్రి అభివృద్ధి
–ఏపీహెచ్‌ఆర్‌డీఐకి ప్రతిపాదన
–ఎన్‌టిఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్
కర్నూలు(హాస్పిటల్): కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా, కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను దాతలచే అభివృద్ధి చేయాలని ఆసుపత్రి ఎన్‌టీఆర్ వైద్యసేవ చీఫ్ ర్యాంకో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈ మేరకు ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్సిట్యూట్(ఏపీహెచ్‌ఆర్‌డీఐ)కి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు గుంటూరు జిల్లా బాపట్లలో ఏపీహెచ్‌ఆర్‌డీఐ ఆధ్వర్యంలో ‘హెల్త్ కేర్ ఇన్ ఇండియా–స్ట్రాటెజిక్ పర్సెస్పెక్టీవీస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారన్నారు. సదస్సుకు మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వైద్యాధికారులు హాజరయ్యారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రులను ఏ విధంగా బలోపేతం చేయాలన్న అంశంపె చర్చించారన్నారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డీఎన్‌బీ కోర్సు ద్వారా స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని సూచించారన్నారు. డీఎన్‌బీ కోర్సు పీజీ, డీఎం,ఎంసీహెచ్ స్థాయి కోర్సుతో సమానమని ది గజిట్ ఆఫ్ ఇండియాలోనే పేర్కొన్నారని తెలిపారు. ఆ దిశగా వైద్యులు డీఎన్‌బీ ద్వారా స్పెషాలిటి కోర్సులు చేయాలని సూచించారు. దీంతో పాటు ఫైబర్ గ్రిడ్‌తో ఇంటర్‌నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ రోగులను పరిశీలించి, వివరాలను ఆన్‌లైన్ ద్వారా జిల్లా కేంద్రంలోని స్పెషలిస్టు వైద్యులకు పంపించి, వారి ద్వారా వైద్యసేవలు అందించేందుకు సైతం ప్రతిపాదనలు చేస్తున్నారన్నారు.