మహిళ గుండెలో 97 కణితులు
కూరగాయలు, మాంసం కడగకుండా తినడంతోఓ మహిళ గుండెలో 97 కణితులు ఏర్పడ్డాయి.
–విజయవంతంగా తొలగించిన పెద్దాసుపత్రి వైద్యులు
–కూరగాయలు శుభ్రం చేయని ఫలితం
కర్నూలు(హాస్పిటల్): కూరగాయలు, మాంసం కడగకుండా తినడంతోఓ మహిళ గుండెలో 97 కణితులు ఏర్పడ్డాయి. వాటిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించి ఊపిరిపోశారు. వివరాలను మంగళవారం ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. కల్లూరు మండలంలోని వెంగన్నబావి సమీపంలో నివసిస్తున్న పెద్దక్క(65) 10రోజుల క్రితం గుండెలో నొప్పి, గుండెదడతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. కార్డియాలజి విభాగంలో ఆమెకు 2డీ ఎకో, సిటీస్కాన్ పరీక్షలు నిర్వహించగా ఆమె గుండెలో 97 కణితులు ఉన్నట్లు బయటపడింది. దీంతో మంగళవారం ఆ మహిళకు ఆపరేషన్ చేసి కణితులు తొలగించినట్లు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సాధారణంగా పొట్టేలు, మేకలు కడగని కూరగాయలను తింటాయి. కూరగాయలపై ఉండే క్రిములు వాటి జీర్ణాశయంలోకి వెళ్లి ఎకినోకోకస్ గ్రాన్యులోసస్ ఆర్గానిజం అనే క్రిమి తయారవుతుంది. అది పెరిగి పెద్దవై వాటి మలం ద్వారా బయటకు వస్తాయన్నారు. ఇవి ఇతర ఆహార పదార్థాలపై వాలుతాయన్నారు. ఇలాంటి కూరగాయలను ప్రజలు కడగకుండా తినడంతో అవి మానవశరీరంలోకి ప్రవేశించి కణితులను సృష్టిస్తాయ’ని తెలిపారు. సాధారణంగా ఇలాంటి కణితులు 70 శాతం కాలేయంలో, 28 శాతం ఊపిరితిత్తుల్లో వస్తాయని, కానీ పెద్దక్కకు గుండె మధ్యలో వచ్చాయన్నారు. ఇలా రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు.