మాతా శిశు విభాగంలో దట్టమైన పొగలు రావడంతో భయంతో బయటకు వస్తున్న బాలింతలు, సహాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ /సర్పవరం : కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మరోసారి మంటలు వ్యాపించాయి. ఈసారి ప్రత్యేక నవజాతి శిశు అత్యవసర చికిత్సా కేంద్రంలో మంటలు చేలరేగాయి. శిశువులకు ఆక్సిజన్ అందించే సీపీఎఫ్ మిషన్ అగ్నికి మాడి మసి అయిపోయింది. తక్షణమే అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే 30 మంది శిశువులున్న వార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకునేది.
ప్రాణాలు అరచేతిలో పట్టుకుని శిశువులతో పరుగులు
సోమవారం రాత్రి ఏడు గంటల మధ్యలో ప్రత్యేక నవజాత శిశు అత్యవసర చికిత్సా కేంద్రం సీపీఎఫ్ మిషన్ షార్ట్ సర్క్యూట్‌కు గురై మంటలు వ్యాపించాయి. శిశువులకు ఆక్సిజన్ అందించే మీషీన్‌లో మంటలు చెలరేగడంతో శిశువులతో కలిసి తల్లులు ఆందోళనతో బయటికి పరుగులు తీశారు. ప్రమాదాలను అదుపు చేసే సీఓ2, డీసీపీ వంటి పరికరాలు లేకపోవడంతో వెంటనే మంటలు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీసిన శిశువులు, బాలింతల ఆర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణ దద్దరిల్లింది. తమ ప్రాణాలు పోయేవని శిశువులను పట్టుకుని తల్లులు రోదిస్తుంటే చూసిన ప్రతి ఒక్కర్నీ కదిలించడమే కాకుండా కంటతడిపెట్టించింది. ఆ సమయంలో ఆ వార్డులో 30 మంది శిశువులతో బాలింతలున్నారు. మంటలు ఏ మాత్రం వ్యాపించినా వార్డులో భారీ ప్రమాదం జరిగేది.
మూడోసారి...
ఇరవై ఐదు రోజుల్లో జీజీహెచ్‌లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం మూడోసారి. గత కొన్ని రోజుల క్రితం మందుల సరఫరా విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏసీలు, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, ముందులు కాలి బూడిదయ్యాయి. పది రోజుల క్రితం మానసిక వికలాంగుల ఓపీ పక్కన, బ్లడ్ బ్యాంక్‌కు ఆనుకుని ఉన్న రికార్డు రూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బ్లడ్ బ్యాంకు, ఎక్స్‌రే విభాగానికి చెందిన ఫైళ్లన్నీ దగ్ధమయ్యాయి. తాజాగా సోమవారం ప్రత్యేక నవజాత శిశువు అత్యవసర చికిత్సా కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆసుపత్రిని తలుచుకుంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో పిల్లల వార్డులో, ఎక్స్‌రే విభాగం దగ్గర, సర్టికల్ వార్డు పై అంతస్తులో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
అదే నిర్లక్ష్యం...
చిన్నారులు చనిపోతున్నా, తల్లులు మృతి చెందుతున్నా...ఆసుపత్రిలో ప్రమాదాలు సంభవిస్తున్నా... అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. కలెక్టర్ పట్టించుకోరు...ఆసుపత్రి అధికారులు సీరియస్‌గా తీసుకోరు...వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment