క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు
పెద్దాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కామినేని
–ఏపీఎంఎస్‌ఐడిసి ఈఈ బదిలీకి సిఫారసు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాన్సర్‌వార్డు నిర్మాణానికి రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. సోమవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా పెద్దాసుపత్రిని తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆసుపత్రిలోని ఓపీ టికెట్ కౌంటర్ విభాగాలను పరిశీలించారు. రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా అవసరమైనన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ నుంచి సూపర్‌స్పెషాలిటీ విభాగాలను పరిశీలించారు. మధ్యలో పాత సర్జికల్ వార్డులు శిథిలావస్థలో కనిపించడం, పైపులైన్ పనులు జరుగుతుండటాన్ని ఆయన గమనించారు. పనులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్వహణ పనుల కోసం రూ.3.5కోట్లు విడుదల చేస్తే ఇప్పటికీ పనులు పూర్తికాలేదంటూ మండిపడ్డారు. పాతభవనాలన్నీ కూలగొట్టాలని చెప్పినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ఎక్కడంటూ ఆరా తీశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ శాఖ ఎండీతో ఫోన్‌లో మాట్లాడారు. మీ అధికారుల పనితీరు ఏం బాగాలేదని, మీరే వచ్చి ఒకసారి పనులు పరిశీలించాలని చెప్పారు. వెంటనే ఈఈ ఉమాశంకర్‌ను రీకాల్ చేసి మారుమూల ప్రాంతానికి బదిలీ చేయాలంటూ ఫోన్‌లో ఆదేశించారు. అనంతరం ఆయన సూపర్‌స్పెషాలిటీ విభాగాలను సందర్శించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేజ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు.