పెద్దాసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అరుదైన గుండె ఆపరేషన్ చేసి వైద్యులు ఓ మహిళకు ప్రాణం పోశారు. నందికొట్కూరుకు చెందిన కైరున్‌బీ (55) కొంత కాలంగా ఆయాసం, ఛాతిలో నొప్పితో బాధపడేది. ఇటీవల ఆమె ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకుంది. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి ఆమెను పరీక్షించి గుండె కవాటాల మధ్య జెల్లీ ట్యూమర్ ఏర్పడిందని గుర్తించి, కార్డియోథొరాసిక్ విభాగానికి రెఫర్ చేశారు. ఈ నెల 12వ తేదీన ఆమెకు కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆపరేషన్ చేసి కణితి తొలగించారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా తక్కువ మందిలో అరుదుగా మహిళలకు ఇలాంటి సమస్య ఏర్పడుతుందన్నారు. ట్యూమర్‌ను ముట్టుకోకుండా ఎంతో చాకచక్యంగా దాని మొదలును మాత్రం కట్ చేసి తొలగించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్ చేయడం చాలా అరుదన్నారు. ఓబులమ్మ అనే మహిళకు క్లిష్టమైన పద్ధతిలో ఆధునిక పేస్‌మేకర్‌ను సీనియర్ రెసిడెంట్, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్‌రెడ్డి అమర్చినట్లు తెలిపారు.