సీమలో తొలిసారిగా బీటింగ్ హార్ట్ సర్జరీ
సీమలో తొలిసారిగా బీటింగ్ హార్ట్ సర్జరీ
Published Mon, Nov 21 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
–పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు గుండె పనిచేస్తుండగానే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళాలను విజయవంతంగా సరిచేశారు. వివరాలను సోమవారం ఆసుపత్రిలోని కార్డియాలజి విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. అనంతపురం జిల్లా వజ్రకరూర్‌కు చెందిన తిరుపాల్‌నాయక్(42) నెలరోజుల క్రితం గుండెపోటుతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరాడు. కార్డియాలజి విభాగాధిపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆయనకు ప్రథమ చికిత్స అందించి, అనంతరం యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించారు. గుండెకు రక్తం సరఫరా చేసే మూడునాళాల్లో ఒకటి మూసుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. అన్ని రకాల వైద్యపరీక్షల అనంతరం గత శనివారం కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహ్మద్‌అలి నేతృత్వంలో గుండె కొట్టుకుంటుండగానే బైపాస్ సర్జరీ చేశారు.
డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీటింగ్ హార్ట్ సర్జరీ చేయడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. హార్ట్‌లంగ్ మిషన్ సహాయం లేకుండానే ఆఫ్‌మిషన్ పద్ధతిలో ఈ శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. వెంట్రుకవాసి కంటే సన్నటి దారంతో 8 కుట్లు వేశామన్నారు. రోగికి 12.30 గంటలకు ఆపరేషన్ పూర్తయితే సాయంత్రం 4.30 గంటలకే వెంటిలేటర్ తొలగించామన్నారు. ఇలాంటి ఆపరేషన్‌లో రక్తస్రావం తక్కువగా ఉంటుందని, నొప్పి కూడా ఎక్కువగా ఉండదన్నారు. అందువల్ల రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలున్న వారికి ఇలాంటి ఆపరేషన్ ఎంతో ఉపయోగకరమన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం కింద ఈ ఆపరేషన్‌ను రోగికి ఉచితంగా చేశామని, అదే ప్రైవేటులో అయితే రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ విభాగం ప్రారంభమైన రెండు నెలలు కూడా కాకముందే 19 గుండెశస్త్రచికిత్సలు చేశామని, అందులో 12 ఓపెన్ హార్ట్ సర్జరీలు ఉన్నాయన్నారు. ఈ విభాగంలో అన్ని రకాల వసతులు, సదుపాయాలు, మందులు ఉన్నాయి కాబట్టే ఇలాంటి శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని వివరించారు. సమావేశంలో కార్డియాలజిస్టులు డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ మహమ్మద్ అలి పాల్గొన్నారు.
Advertisement