ఆపరేషన్ చేయించుకున్న శ్రీనివాసులుతో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు(హాస్పిటల్): గుండెలో కాస్త ఇబ్బంది అయితేనే ఎంతో కష్టంగా ఉంటుంది. ఊపిరాడకుండా గుండె ఆగిపోతుందన్న ఆందోళన, భయం మనిషిని కుంగదీస్తుంది. అయితే ఓ వ్యక్తి గుండెలో అరకిలో కణితితో నిత్యం నరక యాతన అనుభవిస్తున్నాడు. అతని బాధను శస్త్రచికిత్సతో కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు తొలగించి ప్రాణం పోశారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం నాగలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు(42) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కొద్దికాలంగా గుండెలో సమస్య ఎదురైంది. స్థానికంగా వైద్యులకు చూపించుకోగా వారు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. నెలరోజుల క్రితం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియోథొరాసిక్ విభాగానికి వచ్చాడు.
విభాగాధిపతి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి పరీక్షించి వైద్యపరీక్షలు నిర్వహించారు. శ్రీనివాసులు మైట్రల్ వాల్వు(కవాటం)లో కాల్షియం చేరడం వల్ల అది కాస్తా చిన్నగా మారిందని, దాని వల్ల ఎడమ కర్ణికలో అరకిలో పరిమాణంలో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్నారు. అవసరమైన అన్ని రకాల వైద్యపరీక్షలు, చికిత్స అనంతరం గత మంగళవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి కణితి తొలగించారు. శ్రీనివాసులు కణితి కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, గుండెదడ సమస్యతో బాధపడేవాడని, అతను మరింత ఆలస్యం చేసి ఉంటే కణితిలోని ముక్క బయటకు వచ్చి మెదడుకు చేరుకుని, పక్షవాతానికి దారి తీసే అవకాశం ఉందని శుక్రవారం తనను కలిసిన విలేకరులతో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స సమయంలోనూ కణితిలోని ముక్క జారకుండా జాగ్రత్త పడ్డామన్నారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment