డబుల్‌ సెంచరీ | 200 Heart Surgeries Completed In Kurnool Hospital | Sakshi
Sakshi News home page

డబుల్‌ సెంచరీ

Published Sat, Jun 9 2018 12:24 PM | Last Updated on Sat, Jun 9 2018 12:24 PM

200 Heart Surgeries Completed In Kurnool Hospital - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్, కార్డియాలజిస్టు డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగంలో 200 గుండె శస్త్రచికిత్సలు పూర్తయినట్లు ఆ విభాగం అధిపతి డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సీటీవీసీ విభాగంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ చేతుల మీదుగా కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016 సెప్టెంబర్‌ 22న సాజిదాబీ అనే నందికొట్కూరుకు చెందిన మహిళకు మొట్టమొదటిసారిగా గుండెలో ఏర్పడిన రంధ్రానికి బైపాస్‌ సర్జరీ చేయడం ద్వారా ప్రస్థానం మొదలైందన్నారు. 2017 సెప్టెంబర్‌ 12న తాడిపత్రికి చెందిన వెంకటరామిరెడ్డికి బీటింగ్‌ హార్ట్‌ సీఏబీజీ చేయడం ద్వారా 100 కేసులు, అదే సంవత్సరం డిసెంబర్‌ 8న కర్నూలుకు చెందిన ప్రభాకర్‌ అనే వ్యక్తికి అతిక్లిష్టమైన బైపాస్‌ సర్జరీ ద్వారా 150 కేసులు పూర్తి చేశామన్నారు.

గురువారం బెలూంకు చందిన బాలపుల్లయ్యకు పూర్తిగా బ్లాక్‌ అయి స్టంట్‌ వేయడం కుదరని పరిస్థితిలో బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా బైపాస్‌ చేసి 200 కేసులు పూర్తి చేశామన్నారు. మొత్తం 200 ఆపరేషన్లలో ఏసీడీలు 16, వీసీడీలు 7, ఎంవీఆర్‌లు 40, డీవీఆర్‌లు 20, సీఏబీజీలు 53, ఊపిరితిత్తుల ఆపరేషన్లు 36, వాక్యులర్‌ ఆపరేషన్లు 11, ఏవీఆర్‌లు 4, పీడీఏలు 5 ప్రధానంగా ఉన్నాయన్నారు. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ రోగులకు వాల్వు రీప్లేస్‌మెంట్‌ ఎక్కువగా చేయడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ జబ్బే లేదని, ఇక్కడే ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. యుక్తవయస్సులో కరోనరి బ్లాక్స్‌ రావడం బాధాకరంగా ఉందన్నారు. ఆరు నెలల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి ఇక్కడ గుండె ఆపరేషన్లు నిర్వహించామన్నారు. అత్యధికంగా డబుల్‌ వాల్వ్‌ ఆపరేషన్లు చేయడం రికార్డు అని తెలిపారు. బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ ఒక ప్రత్యేకత అని, ఎంఐసీఎస్‌ చిన్న కోతతో చేసే రూ.6 లక్షల వరకు ఖర్చుతో కూడిన హార్ట్‌ ఆపరేషన్లు 25 మంది పేదలకు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అనెస్తెషియా విభాగం వైద్యులు డాక్టర్‌ రఘురామ్, డాక్టర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement