పెద్దాసుపత్రిలో ఇది ‘క్యాజువల్’
పెద్దాసుపత్రిలో ఇది ‘క్యాజువల్’
Published Thu, Aug 25 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వలి గుండె సంబంధ సమస్యతో అల్లాడిపోతున్నాడు. జొహరాపురానికి చెందిన శ్రీరాములు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుల పత్తా లేదు. 8.30 గంటలు దాటినా వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. సమయం గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన అధికమవుతోంది. క్షణ.. క్షణం నరకమే. కాస్త సూటూబూటూ వేసుకొని ఎవరు కనిపించినా డాక్టరే వచ్చారేమోననే ఆతత. ప్రాణం విలువ అలాంటిది. ఈ విషయం తెలిసిన వైద్యులేమో నింపాదిగా నిర్ణీత సమయానికి గంట తర్వాత అక్కడికి చేరుకోవడం చూస్తే పెద్దాసుపత్రిలో వైద్య సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతోంది.
కర్నూలు(టౌన్): ఐదు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. రోగుల ప్రాణం వీరికి పూచిక పుల్లతో సమానం. కొందరు వైద్యులు వృత్తిని దైవంగా భావిస్తున్నా.. మరికొందరి తీరు ఆసుపత్రి పరువును బజారున పడేస్తోంది. ఇక్కడి వైద్యులు నాడి పడితే.. మొండి వ్యాధులు కూడా నయమవుతాయనే ప్రఖ్యాతి.. క్రమంగా మసకబారుతోంది. విధులకు సక్రమంగా హాజరు కావాలని.. సమయ పాలనే పాటించాలనే విషయం ఇక్కడ కొందరికే వర్తిస్తుంది. ప్రధానంగా అత్యవసర విభాగంలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రాణాపాయ స్థితిలోని రోగులు వచ్చే ఈ విభాగంలో ప్రాణం పోతోందంటే కూడా స్పందించని దయనీయ పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రి ఇద్దరు రోగులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి రాగా.. ఒక్క వైద్యుడు కానీ, స్టాఫ్ నర్సులు కానీ అందుబాటులో లేరు. రాత్రి 8 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉన్నా.. వీరి జాడ లేకపోయింది. అక్కడి పరిస్థితిని రోగుల కుటుంబ సభ్యులు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డిల దష్టికి తీసుకెళ్లారు. ఇరువురూ వెంటనే అక్కడికి చేరుకొని వాస్తవ పరిస్థితిని సూపరింటెండెంట్‌కు ఫోన్‌లో తెలియజేశారు. ఆయన ఆదేశాలతో సీఎస్‌ఆర్‌ఎం శ్రీనివాసులు క్యాజువాలిటీకి చేరుకొని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాదాపు గంట తర్వాత ప్రత్యక్షమైన వైద్యులు రోగుల సేవకు ఉపక్రమించడం గమనార్హం.
పత్తాలేని డ్యూటీ డాక్టర్
రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ మంజుల 9 గంటల వరకు కూడా విధుల్లోకి రాకపోవడం గందరగోళానికి తావిచ్చింది. అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు క్యాజువాలిటీ మంచాలన్నీ రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం పట్ల రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం సమాధానం చెప్పేందుకు పీజీ వైద్యులు కూడా లేకపోవడం చూస్తే ఈ అత్యవసర విభాగం ఏ స్థాయిలో సేవలందిస్తుందో అర్థమవుతుంది.
చస్తే కానీ పట్టించుకోరా..
సామాన్య రోగులను పెద్దాసుపత్రిలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ క్యాజువాలిటీలో కూడా రోగులను పట్టించుకోకపోవడం చూస్తే అత్యవసరం వైద్యం ఏ స్థాయిలో చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. రోగులను తరలించేందుకు బాయ్‌లు కూడా లేరని.. ఇంజెక్షన్ చేసేందుకు నర్సింగ్ విద్యార్థులు కూడా అందుబాటులో లేకపోవడం చూస్తే పెద్దాసుపత్రి పరిస్థితి ఎలా తయారయిందో తెలుస్తోందన్నారు.
Advertisement
Advertisement