వణుకు | fearing | Sakshi
Sakshi News home page

వణుకు

Published Sat, Jan 28 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

వణుకు

వణుకు

స్వైన్‌ఫ్లూ పడగ నీడలో కర్నూలు
–ఒకరికి వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ
–పెద్దాసుపత్రిలో చికిత్స
–అందుబాటులో లేని ప్రత్యేక మాస్క్‌లు
–సిద్ధం కాని ఐసోలేషన్‌ వార్డు
 
స్వైన్‌ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందేననే ఆందోళన అధికమైంది. ఈ కారణంగా సాధారణ జలుబుతో రోగి వచ్చినా ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది కూడా బెంబేలెత్తుతున్నారు. ఇక వ్యాధి లక్షణాలతో ప్రయివేట్‌ ఆసుపత్రులకు వెళ్లే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది.
 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ యేడాది ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన ఒకరు, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన ఒకరు వ్యాధి బారిన పడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిసరాల్లో వ్యాధి అధికంగా ఉండటంతో వ్యాపార, ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. స్వైన్‌ఫ్లూ భయంతో సాధారణ జలుబు, దగ్గు వచ్చినా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇప్పటికే వ్యాధిపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు అతికించి చేతులు దులుపుకుంటోంది.
 
పెద్దాసుపత్రిలో పూర్తికాని ప్రత్యేక వార్డు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం పేయింగ్‌ బ్లాక్‌లో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడినప్పుడంతా అధికారులు అప్రమత్తమై ఈ వార్డును తెరుస్తున్నారు. అయితే ఈసారి ఒక రోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా అతన్ని ఏఎంసీలోని ఆర్‌ఐసీయూలో ఉంచారు. ఐసోలేషన్‌ వార్డులో సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ ఏర్పాటు కాకపోవడంతో ఇంకా ప్రారంభించలేదు. ఫలితంగా ఏఎంసీలో సాధారణ రోగుల మధ్యే స్వైన్‌ఫ్లూ రోగిని ఉంచడంతో వైద్యులు, సిబ్బందితో పాటు ఇతర రోగులు ఆందోళనకు లోనవుతున్నారు. దీనికితోడు ఆసుపత్రిలో తగినంతగా 95వ నెంబర్‌ ప్రత్యేక మాస్క్‌లు లేకపోవడంతో వైద్యులు సైతం చికిత్స చేయడానికి జంకుతున్నారు. కనీసం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికైనా ఈ మాస్క్‌లు తెప్పించాలని వారు కోరుతున్నారు.
 
స్వైన్‌ఫ్లూ ఎలా వ్యాపిస్తుందంటే..
ఇది హెచ్‌1, ఎన్‌1 అనే ఇన్‌ఫ్లూయాంజా ఏ వైరస్‌ వల్ల వ్యాప్తి చెందుతుంది. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. ఇది ‘ఫ్లూ’ మాదిరిగానే ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగంలో సోకటం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంభవిస్తుంది.
 
వ్యాధి లక్షణాలు ః తీవ్రమైన తలనొప్పి, జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఎడతెరపి లేని దగ్గు, ఒళ్లునొప్పులు, చలి, వాంతులు, శ్వాస తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం, విరేచనాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
 
వ్యాధి నివారణ 
  •  చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఎక్కువ నీటిని, ద్రవపదార్థాలను తాగాలి.
  • శుభ్రమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
  • తగినంత నిద్ర అవసరం.
  • నోటికి 95వ నెంబర్‌ మాస్కులు అవసరం.
  • వ్యాధిగ్రస్తులు వాడిన టవాళ్లు, కర్చీఫ్‌లు ఇతరులు వాడరాదు.
  • రద్దీగల ప్రదేశాల్లో తిరగరాదు. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు.
  • తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. 
  • వ్యాధిగ్రస్తులు బయట తిరగకుండా ఉంటే మంచిది.
  • ప్రధానంగా బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, షుగర్, కిడ్నీ, ఎయిడ్స్‌ రోగులు జాగ్రత్తగా ఉండాలి.
 
మాస్క్‌ల కోసం ఆర్డర్‌ పెట్టాం
ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేస్తున్నాం. సెంట్రల్‌ ఆక్సిజన్‌ వర్క్‌ కాస్త పెండింగ్‌ ఉంది. ప్రస్తుతానికి ఒక స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తున్ని ఏఎంసీలోని ఆర్‌ఐసీయూలో ఉంచాం. వ్యాధిగ్రస్తుల కోసం వెంటిలేటర్లు, యాంటివైరల్‌ మాత్రలు వసల్టామివిర్‌ ట్యాబ్లెట్లు 75 మి.గ్రా. 1000, సిరప్‌లు 20 బాటిళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 200 మాస్క్‌లు ఉన్నాయి. ఇంకా 2వేలు కావాలని ఆర్డర్‌ పెట్టాం.
–డాక్టర్‌ జె.వీరాస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement