రోగి బంధువుపై సెక్యూరిటీ సిబ్బంది దాడి
Published Fri, Feb 10 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సొంతూరి మహిళను పరామర్శించేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా చావబాదారు. బాధితుని కథనం మేరకు.. కర్నూలు మండలం జి.సింగవరం గ్రామానికి చెందిన మోహన్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరింది. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు మోహన్‌గౌడ్ వచ్చాడు. ఆమె పరిస్థితి విషమంగా కనిపించడంతో చికిత్స చేయాలని వైద్యులను బతిమిలాడాడు.
దీంతో వైద్యసిబ్బందికి, అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మోహన్‌గౌడ్‌ను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీస్ అవుట్‌పోస్ట్ వద్ద కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో మోహన్‌గౌడ్ చెవి కొద్దిగా తెగిపోయింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌గౌడ్ కుటుంబసభ్యులు క్యాజువాలిటి బయట ధర్నా చేశారు. బాధితుడు మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో సెక్యూరిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. పోలీసుల ఎదురుగానే తనను తీవ్రంగా కొట్టారని, కొట్టిన వారిని శిక్షించాలని కోరారు.
Advertisement
Advertisement