సమష్టిగా క్షయను నిర్మూలించాలి
సమష్టిగా క్షయను నిర్మూలించాలి
Published Sat, Mar 25 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
కర్నూలు(హాస్పిటల్): సమష్టికృషితో క్షయ వ్యాధిని నిర్మూలిద్దామని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కేంద్రం అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, డయాబెటీస్ ఉన్న వారికి చాలా మందికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి సోకుతుందని చెప్పారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని, కానీ ఆరేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి వస్తే ఇతరులకు సోకదన్నారు.
క్షయతో జీవనప్రమాణాలు తగ్గుతాయన్నారు. ఊపిరితిత్తులకే గాకుండా అన్ని అవయవాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ క్షయ పూర్తిగా నిర్మూలించగలిగే జబ్బన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐఎంఏ కర్నూలు అధ్యక్షుడు కైప శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితమే క్షయ ఉందని, కాలక్రమేణా ఈ వ్యాధికి మెరుగైన వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో మరణాల సంఖ్య తగ్గిందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ మీనాక్షి మహదేవ్ మాట్లాడుతూ టీబీ మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయని చెప్పారు. అనంతరం క్షయ నిర్మూలనలో విశేష సేవలందించిన డాక్టర్ సుశీల్ ప్రశాంత్, ల్యాబ్‌టెక్నీషియన్ బి. వెంకటేశ్వర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ జె. శ్రావణ్‌కుమార్, డి. మౌలాలితో పాటు బెస్ట్ డాట్ ప్రొవైడర్ అంగన్‌వాడీ వర్కర్‌గా మీనాక్షి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. చివరగా క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన పీజీ వైద్య విద్యార్థులు శశిభరత్‌కుమార్‌రెడ్డి, సరితశ్యాముల్(ప్రథమ), పి.కళ్యాణి, శాంతికుమారి(ద్వితీయ), ఎ. గోపీచంద్, సాయికిరణ్(తృతీయ), టి. వినీత, సర్ఫరాజ్, ప్రభావతి, ఇ. వెంకటేశ్వర్లకు జ్ఞాపికలు అందజేశారు.
Advertisement
Advertisement