క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
Published Fri, Mar 24 2017 10:57 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపు
- కాకినాడలో టీబీ నిర్మూలన దినోత్సవ ర్యాలీ
కాకినాడ వైద్యం : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి(జీజీహెచ్)లో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏటా ఒక కొత్త రోగి నుంచి క్షయ వ్యాధి 15 మందికి సోకుతోందని, దీనినిబట్టి దీని ప్రభావం సమాజంపై ఏమేరకు పడుతోందో గుర్తించాలని అన్నారు. క్షయ నివారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి, ఉచితంగా మందులు అందిస్తోందన్నారు. ఈ కారణంగా వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో రోగ నిర్ధారణకు చాలా రోజులు పట్టేదని, ప్రస్తుతం అత్యాధునిక విధానాలతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే కళ్లె పరీక్షతో క్షయ వ్యాధిని గుర్తిస్తున్నారని చెప్పారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా డాట్ చికిత్స పొంది ఆరోగ్యంగా జీవించాలని కోరారు. రోగులు సక్రమంగా మందులు వేసుకోకపోతే వ్యాధి తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రోగి ఇంటికే డాట్ ప్రొవైడర్లు వెళ్లి చికిత్స అందించే ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని వివరించారు. ఏజెన్సీలో క్షయ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అక్కడ ప్రత్యేక అవగాహన సమావేశాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 2,656 మందికి డాట్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో 261 మందికి ఈ చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వాస్పత్రి నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ సాగింది. అక్కడ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ-2 రాధాకృష్ణమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జెబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వరి పాల్గొన్నారు.
Advertisement
Advertisement