లక్ష్య సాధనకు కృషి చేయాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ : ఆరోగ్యమిత్రలు ఇచ్చిన లక్ష్య సాధనకు కృషి చేయాలని, లక్ష్యం సాధించని వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ హాలులో ఆరోగ్య రక్ష కార్యక్రమంపై కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్యమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏప్రిల్ 7వ తేదీన ఆరోగ్య రక్ష పథకం ప్రారంభిస్తోందని దీనిని అందరూ వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీలోపు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చునని, ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య పథకమైనందున దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ఆరోగ్యమిత్రలపై ఉందన్నారు. డోర్ టూ డోర్ క్యాంపైన్ నిర్వహించి అర్హులైన కుటుంబాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సంవత్సరానికి కుటుంబంలోని పిల్లల నుంచి పెద్దల వరకు ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున చెల్లించి హెల్త్‌కార్డు పొందాలన్నారు. ఈ పథకం ద్వారా 410 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోవచ్చునన్నారు. 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్‌వార్డు (ఏసీ)లో వైద్యం అందిస్తారన్నారు. హెల్త్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రూ.2లక్షల వరకు వైద్యసహాయం పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్ పాల్గొన్నారు.