క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
Published Thu, Mar 23 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్
కాకినాడ వైద్యం : జిల్లాను క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాకినాడ జీజీహెచ్ క్షయ నివారణాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6,716 మంది టీబీ కేసులు నమోదు కాగా, డైరెక్ట్‌లీ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ (డాట్) చికిత్స ద్వారా 6,157 మందికి వ్యాధిని నయం చేశామన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాట్‌ప్లస్ సెంటర్ ద్వారా మొండి క్షయ రోగులకు రెండు లక్షలు విలువైన మందులను పీహెచ్‌సీల ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. దీని నివారణ కోసం డీఆర్‌టీబీ చికిత్స రెండేళ్లపాటు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టీబీ వ్యాధిని కల్లి పరీక్ష ద్వారా నిర్ధారిస్తామన్నారు. జిల్లాలో కల్లి పరీక్షను చేసేందుకు 63 మైక్రోస్కోపి సెంటర్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రోగ నియంత్రణకు 23 ట్రీట్‌మెంట్ యూనిట్స్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రసుత్తం 2,656 మందికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.ఇందులో 73 మొండి క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు. హెచ్‌ఐవీ సోకిన రోగుల్లో టీబీని నిర్ధారించడానికి జిల్లాలో కాకినాడలో ఒకటి, రాజమహేంద్రవరంలో రెండు సిబీనాట్ సెంటర్లు ఉన్నట్టు తెలిపారు. ఒక్కో మెషీన్ ఖరీదు సుమారు రూ.20 లక్షలు దాకా ఉందన్నారు. వీటిని 2015 నుంచి అందుబాటులోకి తీసుకురాగా ఫిబ్రవరి నెలాఖరుదాకా 9,680 మందికి పరీక్షలు నిర్వహించామని, 432 క్షయ కేసులు, 34 మొండి కేసులు గుర్తించామన్నారు.
నేడు ర్యాలీ
మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నుంచి బాలాజీచెరువు దాకా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రారంభిస్తారన్నారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు.
23కెకెడీ165: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ ఎన్.ప్రసన్నకుమార్
Advertisement
Advertisement