‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి | effort for EKMO | Sakshi
Sakshi News home page

‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి

Published Sat, Apr 8 2017 12:24 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి - Sakshi

‘ఎక్మో’ ఏర్పాటుకు కృషి

- డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు పీఎంను ఆహ్వానిస్తాం
- ఎంపీ బుట్టా రేణుక
 
కర్నూలు(హాస్పిటల్‌): ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఊపిరిపోసే ఎక్మో చికిత్సా యంత్రాన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం కర్నూలు మెడికల్‌ కళాశాల డైమండ్‌జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని కళాశాలలోని కార్డియాలజీ విభాగంలో ఎక్మో చికిత్సపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. అమెరికాకు చెందిన డాక్టర్‌ పూబోని సునీల్‌కుమార్, బృందం సభ్యులు కలిసి ఎక్మో చికిత్సా విధానం గురించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఎంతో ఖరీదైన దన్నారు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న రోగికి చికిత్స అందిస్తే 60 నుంచి 70 శాతం సక్సెస్‌ రేటు ఉందని వైద్యుల మాటలను బట్టి తెలుస్తోందన్నారు. కళాశాల డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
 
చదువుకున్న కళాశాల అభివృద్ధికి కృషి
 యూకేకు చెందిన ఎక్మో చికిత్సా నిపుణులు డాక్టర్‌ పూబోని సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్నానని, కళాశాల అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచిస్తుంటానని అన్నారు. 2003లో ఓసారి ఎక్మో చికిత్సపై ఈ కళాశాలలో వర్క్‌షాప్‌ నిర్వహించానని, ఇప్పుడు ఈ ప్రక్రియ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పరికరాలు, ఎలా పనిచేస్తుందనే విషయాలపై చర్చిస్తామన్నారు. ఎక్మో చికిత్స కార్డియాలజీ కార్డియోథొరాసిక్, పీడియాట్రిక్, అనెస్తెషియా వైద్యులు చేయాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిలో ఎక్మో ఏర్పాటు చేస్తే సాంకేతికంగా తమ వైపు నుంచి ప్రోత్సాహమందిస్తామన్నారు.
 
ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్‌ మాట్లాడుతూ ఎక్మో చికిత్సా విధానం ఆధునిక విధానమన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలోని 13 బోధనాసుపత్రుల వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎక్మో చికిత్సా విధానంపై డాక్టర్‌ పూబోని సునీల్‌కుమార్‌ వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌. వెంకటరమణ, రేడియాలజి విభాగాధిపతి డాక్టర్‌ ఒ.జోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement