సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాలు క్రితం అడ్డదారిలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తుంటే ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. కర్ణాటకలో విజయపుర జిల్లాలోని ఇండి నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ప్రధాని మోదీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అందరూ కొనియాడుతూ ఉంటారని అలాంటప్పుడు ఆయనకు కర్ణాటకలో ప్రభుత్వం ఏం చేస్తోందో తెలీదా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతీ పనికి 40% కమీషన్లు తీసుకుంటూ ఉంటే కర్ణాకటను అభివృద్ధికే నమూనాగా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కాంట్రాక్టర్లు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతితో కంపెనీలు హైదరాబాద్, చైన్నై వైపు వెళుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఓట్ల కోసం తాను రాలేదని, వారి భవిష్యత్, పిల్లల భవిష్యత్ కోసమే వచ్చానంటూ ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment