మాదిగ ఆత్మీయ సమావేశాలంటూ విభజన రాజకీయాలు
ఆత్మీయ సమావేశానికి నామమాత్రంగా హాజరైన మాదిగలు
ఎమ్మెల్యే స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాదిగ సామాజికవర్గం
తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే చెల్లుతుంది. ఆయన శిష్యబృందం కూడా అదే దారిలో పయనిస్తోంది. నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ సమ్మేళనం పలు విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దుష్ట కుల రాజకీయానికి తెరలేపడంపై నియోజకవర్గంలోని మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన 40 సంవత్సరాల నుంచి ఏ రోజూ ఈ విధంగా కుల రాజకీయాలు చేయలేదు. కానీ, దళితులైన మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాదిగ ఆత్మీయ సమావేశం పెట్టి సరికొత్త కుటిల రాజకీయానికి ఎమ్మెల్యే స్వామి తెరతీయడంపై మాదిగ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటివరకు మాదిగలను పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. వైఎస్సార్ సీపీ తరఫున కొండపి నుంచి మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తుండటంతో మాల, మాదిగ అంటూ కుల ప్రస్తావన తెస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
అందులో భాగంగానే మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇటీవల మంత్రి సురేష్ మాల, మాదిగ అని వేరు చేయకుండా సింగరాయకొండలో దళితుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాల, మాదిగలు తనకు రెండు కళ్లు లాంటివారని స్పష్టం చేశారు. టీడీపీకి మాదిగలు దూరమవుతున్నారని, అందుకు ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలే కారణమని అన్నారు. మాదిగల మనుగడను, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కొండపి నియోజకవర్గానికి మంత్రి సురేష్ వచ్చారని భావిస్తున్నామని మాదిగలు కూడా అంటున్నారు. కొండపికి వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిగా మంత్రి సురేష్ వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషిని గమనించి మాదిగ సామాజికవర్గం టీడీపీకి దూరం అవడాన్ని గమనించిన ఎమ్మెల్యే స్వామి.. ప్రస్తుతం దుష్ట కుల రాజకీయానికి తెరలేపారని మాదిగ సామాజికవర్గం ఆరోపిస్తోంది.
ఇన్నాళ్లు మాదిగ సామాజికవర్గాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే స్వామి.. గత పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడూ మాదిగల అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇప్పటివరకు సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించని ఏకై క ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఎమ్మెల్యే స్వామి అని మాదిగలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్ నియోజకవర్గంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారని మాదిగలు గుర్తుచేస్తున్నారు. కొండపిలో మంత్రి సురేష్ పోటీ చేస్తుండటంతో ప్రస్తుతం మాదిగలపై టీడీపీ కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తోందని, ఇదే ప్రేమ మొదటి నుంచి చూపించి ఉంటే మాదిగలు టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు.
ఏదిఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్నందున టీడీపీకి మాదిగలు గుర్తుకురావడం బాధగా ఉందని మాదిగ సామాజికవర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఎన్ని ఆత్మీయ సమావేశాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేమని మాదిగలు తెలియజేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది మాదిగ సామాజికవర్గం వారు ఉన్నారు. టీడీపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి మాదిగల ఆత్మీయ సమావేశానికి సుమారు రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో మాదిగలు కేవలం 1,500 మంది మాత్రమే ఉన్నారు. టీడీపీకి మాదిగలు దూరంగా ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని మాదిగలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలేగానీ.. ఈ విధంగా కుల విభజన రాజకీయాలు చేస్తే కలిసికట్టుగా టీడీపీకి, స్వామికి గుణపాఠం చెబుతామని దళితులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment