adimulam suresh
-
'జగనన్నకు కొండపిని కానుకగా ఇస్తా!' : ఆదిమూలపు సురేష్
ప్రకాశం/కొండపి: కొండపి సీటు గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడమే తన లక్ష్యమని, అందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపి మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి నియోజకవర్గ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సెమీ క్రిస్మన్ వేడుకలు, సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు 29 ఉండగా, అందులో 27 నియోజకవర్గాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందన్నారు. మిగిలిన వాటిలో రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీలోకి వచ్చారని, ఇక కేవలం కొండపి మాత్రమే ఉందని అన్నారు. ఈసారి కొండపి సీటును వైఎస్సార్ సీపీ తప్పకుండా కై వసం చేసుకుంటుందన్నారు. తాను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో కొండపి అభ్యర్థిగా పోటీ చేస్తానని, జగనన్న వదిలిన బాణం తానని సురేష్ ఉద్వేగంగా మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అండదండలతో కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. సెమీ క్రిస్మస్ కేకు, జగనన్న పుట్టినరోజు కేకును మంత్రి సురేష్ కట్ చేసి అందరికీ స్వయంగా తినిపించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బొక్కిసం ఉపేంద్ర, పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి మంత్రి సురేష్, ఆయన కుమారుడు విశాల్‌కు గజమాల వేసి సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మిడసల అశోక్, ఐ.కోటేశ్వరరావు, బి.రమేష్, ఎం.సాంబశివరావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాకా పిచ్చిరెడ్డి, కొండపి మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగయ్య, బొక్కిసం సుబ్బారావు, జేసీఎస్ మండల కన్వీనర్ గొట్టిపాటి మురళి, ఆరికట్ల హరినారాయణ, దివి శ్రీనివాసరావు, రావెళ్ల రాజీవ్, వేముల వెంకట ప్రసాద్, కోటు, సుబ్బయ్య, ఆల శ్రీనివాసులరెడ్డి, పోటు శ్రీనివాసరావు, మండల కొండయ్య, పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి, టంగుటూరు మండల అధ్యక్షుడు ఎం.రాఘవరెడ్డి, జరుగుమల్లి మాజీ ఎంపీపీ బెల్లం సత్యన్నారాయణ, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, కొరకూటి వెంకటేశ్వర్లు, దుంపా అనిల్‌కుమార్‌రెడ్డి, శేషారెడ్డి, కనిగిరి డీఎస్పీ ఆర్.రామరాజు, సీఐలు పాండురంగారావు, దాచేపల్లి రంగనాఽథ్, ఎస్సైలు వై.నాగరాజు, టి.శ్రీరామ్, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు ఫైర్
-
రికార్డు ‘సెట్’ చేసిన అబ్బాయిలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ సెట్–2021) ఫలితాల్లో అబ్బాయిల హవా కొనసాగింది. ఇప్పటికే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఫలితాలు వెలువడగా.. తాజాగా అగ్రికల్చర్, ఫా ర్మసీ ఫలితాల్లోనూ టాప్ టెన్ ర్యాంకుల్లో 8 అబ్బాయిల సొంతమయ్యాయి. 3, 4, 5, 8, 9 ర్యాంకుల్ని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. బైపీసీ స్ట్రీమ్‌కు 83,820 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షకు హాజరయ్యారు. 72,488 మంది (92.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 48,710 మంది అమ్మాయిలు కాగా.. 23,778 మంది అబ్బాయిలు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణువివేక్ మొదటి ర్యాంకు సాధిం చాడు. అనంతపురం నగరానికి రంగు శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన విద్యార్థులకు 6, 7, 10 ర్యాంకులు దక్కాయి. ఫలితాల విడుదల అనంతరం మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బుధవారం నుంచి వెబ్సైట్లో ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఎంపీసీ స్ట్రీమ్‌తో పోలిస్తే బైపీసీ స్ట్రీమ్‌లోనే అధిక శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. రికార్డు సమయంలో ఫలితాల విడుదల అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో 84 కేంద్రాల్లో ఐదు సెషన్లలో నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడు రోజుల రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేసినట్టు వివరించారు. సెషన్‌కు ఒకటి చొప్పున మొత్తం ఐదు రకాల ప్రశ్నపత్రాలను రూపొందించామని, ప్రతి దానిలో సమతుల్యం పాటిస్తూ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరీక్షల అనంతరం ‘కీ’ని విడుదల చేసి విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రత్యేక కమిటీ ద్వారా నివృత్తి చేసి తుది ఫలితాలను రూపొందించామన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఏపీ ఈఏపీసెట్‌ను నిర్వహించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనిటరింగ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు లక్ష్మమ్మ, రామ్మోహనరావు, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం: విష్ణువివేక్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు సాధించిన చందం విష్ణువివేక్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామం. వివేక్ తండ్రి వెల్డింగ్ షాపు నిర్వహిస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. వివేక్ తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు సాధించిన విషయం విదితమే. వివేక్ మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీలో మొదటి ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ పూర్తి చేస్తానని చెప్పాడు. న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి న్యూరాలజిస్ట్‌గా సేవలందించాలన్నది తన లక్ష్యమని తెలిపాడు. ఆబ్జెక్టివ్ ఎలిమినేషన్ విధానమే విజయ రహస్యం: కార్తికేయ రెండో ర్యాంకు సాధించిన శ్రీనివాస కార్తికేయ స్వస్థలం అనంతపురం. తెలంగాణ ఎంసెట్‌లోనూ ఇతడికి రెండో ర్యాంకు వచ్చింది. ఇతని తల్లిదండ్రులు పద్మజ, సుధీంద్ర ఇద్దరూ డాక్టర్లే. శ్రీనివాస కార్తికేయ మాట్లాడుతూ.. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా చదవడం, అబ్జెక్టివ్ ఎలిమినేషన్ విధానాన్ని అనుసరించడమే తన విజయ రహస్యమని తెలిపాడు. నీట్ కూడా బాగా రాశానని, అందులోనూ మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే లక్ష్యమని తెలిపాడు. -
ప్రాథమిక విచారణ లేని ఎఫ్ఐఆర్ వల్ల ఉద్యోగులపై మచ్చ పడుతుంది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాథమిక విచారణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల సమాజంలో వారిపై మచ్చ ఏర్పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ హిమకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ అవసరం లేదని దర్యాప్తు సంస్థ ఎందుకు భావిస్తోందో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలు వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరపలేదని, ఆధారాలు చూపకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని మంత్రి ఆదిమూలం సురేష్ దంపతుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌దవే ధర్మాసనానికి తెలిపారు. -
‘అమ్మ ఒడి’పై త్వరలోనే సీఎం స్పష్టత..
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపై మంత్రి ఆదిమూలపు సురేష్, యూనివర్సిటీ వీసీలతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు ఏళ్లలో ప్రభుత్వ బడుల ఆధునీకరణకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మౌలిక వసతులు, అత్యాధునిక వసతులు అనే రెండు అంశాలుగా విభజించామని చెప్పారు. విద్యాశాఖలో ఇంజనీరింగ్ విభాగాల మధ్య సమన్వయ లోపం ఉందని అన్నారు. సమన్వయ లోపంతో పాఠశాలల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, అన్ని విభాగాల్లోని ఇంజనీరింగ్ సిబ్బందిని ఏకతాటిపైకి తేవాలని నిర్ణయించామని తెలిపారు. అమ్మ ఒడి పథకం తమకు వర్తింపజేయాలని ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రజలు కోరుతున్నట్లు వెల్లడించారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తింపజేయాలా వద్దా అనే విషయమై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి అమలుపై సీఎం వైఎస్ జగన్ త్వరలోనే స్పష్టత ఇస్తారని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు పైన సీఎం త్వరలోనే స్పష్టత ఇస్తారని అన్నారు. -
‘పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ప్రారంభింపచేస్తాం’
సాక్షి, ప్రకాశం : ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యపై మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గత ఐదేళ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. ఒంగోలు, మర్కాపురంలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కావరిడార్ పనులపై త్వరలో సమీక్షిస్తామన్నారు. రైతులకు పగటిపైట తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలుకు తీసుకొస్తాం : ఆదిమూలపు జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఇడుపులపాయలో నడుస్తోందని, ఆ తరగతులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు త్వరలో జిల్లాల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేష్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మఒడి కార్యక్రమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రెండు ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాని మారుస్తామన్నారు. -
'పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతం అయిందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలం సురేష్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంలో నిర్మించాలని తలపెట్టిన మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయులు) ఏమైనా ఉంటే వాటిని, చంద్రబాబుకు జపాన్ ప్రధానమంత్రి ఏవైనా స్పష్టమైనహామీలు ఇచ్చి ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయాలని కోరారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు జపాన్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ లోని ఆ దేశపు అంతర్జాతీయ సంస్థలైన ‘జట్రో’, ‘జెపిఐసీ’, ‘ఎన్ఇడీఓ’, ‘జైకా’ వంటి సంస్థలతో సమావేశమైన తీరు, అక్కడ జరిగిన హడావుడి చూసి రాష్ట్రానికి ఎన్నో ఒప్పందాలతో వస్తారని ఆశిస్తే ‘నమ్మకం కుదిరితేనే పెట్టుబడులు పెడతారు’అని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో 9 ఏళ్లు సుదీర్ఘకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదు, అపుడు లేని నమ్మకం ఈ ఆరు నెలల్లోనే ఎలా కుదిరిందని సురేష్ ప్రశ్నించారు. పైగా ఇంతకుముందే చేసుకున్న ఒప్పందాలను మళ్లీ కొత్తవిగా చూపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడులు తెస్తానని ప్రగల్భాలు పలుకుతూ జపాన్, సింగపూర్, దావోస్‌కు వెళ్లి చివరికి ఈ రాష్ట్రాన్ని సోమాలియా, ఉగాండాలాగా ఎక్కడ మార్చేస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలతోనే పెట్టుబడులు వస్తాయనుకుంటే గతంలో చంద్రబాబు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షలాది కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని, చివరికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రంలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని, అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏమిటని సురేష్ ప్రశ్నించారు. జపాన్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, జపాన్ భాష నేర్చుకోవడానికి కోర్సులు ప్రవేశ పెడతామని చంద్రబాబు చెబుతున్న వాటిల్లో కొత్తవేమీ లేవని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవడమనే ప్రక్రియ దేశంలోఎప్పటి నుంచో ఉందని, ఇదేదో ఇపుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టడమేనని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని అయితే చంద్రబాబు కన్నా ముందే మన దేశంలో చాలా సంస్థలు ఈ భాషను నే ర్పిస్తున్నాయనే విషయం గమనించాలని ఆయన అన్నారు. 2000 సంవత్సంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘జపాన్ ప్రొఫియన్సీ టెస్ట్’ నిర్వహణ కోసం హైదరాబాదŠలో కేంద్రమే లేదని, అపుడు ప్రథమంగా చెన్నైలో కేంద్రాన్ని పెట్టారని సురేష్ గుర్తు చేస్తూ అపుడు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నించారు. జపాన్ భాష పేరు చెప్పి ప్రజలను తపšదోవ పట్టించడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనలపై చంద్రబాబు మాయమాటలు చెప్పకుండా రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. ఆందోళనను ‘ఈవెంట్’ అంటారా! పింఛన్ల తొలగింపు, రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేయకపోవడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న వైఎస్సార్ సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో చేయతలపెట్టిన మహాధర్నాలు ఈవెంట్ మేనేజర్ల సహకారంతో చేస్తున్నారని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిన కథనాన్ని సురేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాన్ని ‘ఈవెంట్’ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజర్ల అవసరం తమకు లేదని, చంద్రబాబు విదేశీ పర్యటనలూ, ఆయన చేసుకునే ప్రచారార్భాటానికే వారి సహకారం తీసుకుంటున్నారన్నారు.