'పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్: తన జపాన్ పర్యటన విజయవంతం అయిందని చంకలు గుద్దుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నాలుగేళ్లలో జపాన్, సింగపూర్ దేశాల నుంచి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయో వివరిస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమన్వయకర్త ఆదిమూలం సురేష్ డిమాండ్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంలో నిర్మించాలని తలపెట్టిన మొత్తం పదివేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయులు) ఏమైనా ఉంటే వాటిని, చంద్రబాబుకు జపాన్ ప్రధానమంత్రి ఏవైనా స్పష్టమైనహామీలు ఇచ్చి ఉంటే వాటిని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు జపాన్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ లోని ఆ దేశపు అంతర్జాతీయ సంస్థలైన ‘జట్రో’, ‘జెపిఐసీ’, ‘ఎన్ఇడీఓ’, ‘జైకా’ వంటి సంస్థలతో సమావేశమైన తీరు, అక్కడ జరిగిన హడావుడి చూసి రాష్ట్రానికి ఎన్నో ఒప్పందాలతో వస్తారని ఆశిస్తే ‘నమ్మకం కుదిరితేనే పెట్టుబడులు పెడతారు’అని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో 9 ఏళ్లు సుదీర్ఘకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదు, అపుడు లేని నమ్మకం ఈ ఆరు నెలల్లోనే ఎలా కుదిరిందని సురేష్ ప్రశ్నించారు. పైగా ఇంతకుముందే చేసుకున్న ఒప్పందాలను మళ్లీ కొత్తవిగా చూపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడులు తెస్తానని ప్రగల్భాలు పలుకుతూ జపాన్, సింగపూర్, దావోస్‌కు వెళ్లి చివరికి ఈ రాష్ట్రాన్ని సోమాలియా, ఉగాండాలాగా ఎక్కడ మార్చేస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.
విదేశీ పర్యటనలతోనే పెట్టుబడులు వస్తాయనుకుంటే గతంలో చంద్రబాబు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షలాది కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని, చివరికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు విభజన తరువాత ఏర్పడిన రాష్ట్రంలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని, అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం ఏమిటని సురేష్ ప్రశ్నించారు.
జపాన్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, జపాన్ భాష నేర్చుకోవడానికి కోర్సులు ప్రవేశ పెడతామని చంద్రబాబు చెబుతున్న వాటిల్లో కొత్తవేమీ లేవని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవడమనే ప్రక్రియ దేశంలోఎప్పటి నుంచో ఉందని, ఇదేదో ఇపుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టడమేనని ఆయన అన్నారు. జపాన్ భాష నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని అయితే చంద్రబాబు కన్నా ముందే మన దేశంలో చాలా సంస్థలు ఈ భాషను నే ర్పిస్తున్నాయనే విషయం గమనించాలని ఆయన అన్నారు.
2000 సంవత్సంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘జపాన్ ప్రొఫియన్సీ టెస్ట్’ నిర్వహణ కోసం హైదరాబాదŠలో కేంద్రమే లేదని, అపుడు ప్రథమంగా చెన్నైలో కేంద్రాన్ని పెట్టారని సురేష్ గుర్తు చేస్తూ అపుడు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారని ప్రశ్నించారు. జపాన్ భాష పేరు చెప్పి ప్రజలను తపšదోవ పట్టించడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనలపై చంద్రబాబు మాయమాటలు చెప్పకుండా రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.
ఆందోళనను ‘ఈవెంట్’ అంటారా!
పింఛన్ల తొలగింపు, రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేయకపోవడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న వైఎస్సార్ సీపీ అన్ని జిల్లా కేంద్రాల్లో చేయతలపెట్టిన మహాధర్నాలు ఈవెంట్ మేనేజర్ల సహకారంతో చేస్తున్నారని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిన కథనాన్ని సురేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాన్ని ‘ఈవెంట్’ అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ మేనేజర్ల అవసరం తమకు లేదని, చంద్రబాబు విదేశీ పర్యటనలూ, ఆయన చేసుకునే ప్రచారార్భాటానికే వారి సహకారం తీసుకుంటున్నారన్నారు.