Boys Top in AP EAP CET Exam - Sakshi
Sakshi News home page

రికార్డు ‘సెట్‌’ చేసిన అబ్బాయిలు

Published Wed, Sep 15 2021 3:55 AM | Last Updated on Wed, Sep 15 2021 3:49 PM

Boys Tops In APEAPCET Andhra Pradesh - Sakshi

వివేక్‌ మొదటి ర్యాంకు, కార్తికేయ రెండో ర్యాంకు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీ సెట్‌–2021) ఫలితాల్లో అబ్బాయిల హవా కొనసాగింది. ఇప్పటికే ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ఫలితాలు వెలువడగా.. తాజాగా అగ్రికల్చర్, ఫా ర్మసీ ఫలితాల్లోనూ టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో 8 అబ్బాయిల సొంతమయ్యాయి. 3, 4, 5, 8, 9 ర్యాంకుల్ని తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. బైపీసీ స్ట్రీమ్‌కు 83,820 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్షకు హాజరయ్యారు. 72,488 మంది (92.85 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

వీరిలో 48,710 మంది అమ్మాయిలు కాగా.. 23,778 మంది అబ్బాయిలు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణువివేక్‌ మొదటి ర్యాంకు సాధిం చాడు. అనంతపురం నగరానికి రంగు శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన విద్యార్థులకు 6, 7, 10 ర్యాంకులు దక్కాయి. ఫలితాల విడుదల అనంతరం మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బుధవారం నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. త్వరలోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఎంపీసీ స్ట్రీమ్‌తో పోలిస్తే బైపీసీ స్ట్రీమ్‌లోనే అధిక శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

రికార్డు సమయంలో ఫలితాల విడుదల
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో 84 కేంద్రాల్లో ఐదు సెషన్లలో నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏడు రోజుల రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేసినట్టు వివరించారు. సెషన్‌కు ఒకటి చొప్పున మొత్తం ఐదు రకాల ప్రశ్నపత్రాలను రూపొందించామని, ప్రతి దానిలో సమతుల్యం పాటిస్తూ నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ప్రశ్నపత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. పరీక్షల అనంతరం ‘కీ’ని విడుదల చేసి విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను ప్రత్యేక కమిటీ ద్వారా నివృత్తి చేసి తుది ఫలితాలను రూపొందించామన్నారు.

కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఏపీ ఈఏపీసెట్‌ను నిర్వహించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మోనిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు లక్ష్మమ్మ, రామ్మోహనరావు, సెట్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

న్యూరాలజిస్ట్‌ కావాలన్నదే లక్ష్యం: విష్ణువివేక్‌
అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు సాధించిన చందం విష్ణువివేక్‌ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామం. వివేక్‌ తండ్రి వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. వివేక్‌ తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు సాధించిన విషయం విదితమే. వివేక్‌ మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీసెట్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మసీలో మొదటి ర్యాంక్‌ సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పూర్తి చేస్తానని చెప్పాడు. న్యూరాలజీలో స్పెషలైజేషన్‌ చేసి న్యూరాలజిస్ట్‌గా సేవలందించాలన్నది తన లక్ష్యమని తెలిపాడు. 

ఆబ్జెక్టివ్‌ ఎలిమినేషన్‌ విధానమే విజయ రహస్యం: కార్తికేయ
రెండో ర్యాంకు సాధించిన శ్రీనివాస కార్తికేయ స్వస్థలం అనంతపురం. తెలంగాణ ఎంసెట్‌లోనూ ఇతడికి రెండో ర్యాంకు వచ్చింది. ఇతని తల్లిదండ్రులు పద్మజ, సుధీంద్ర ఇద్దరూ డాక్టర్లే. శ్రీనివాస కార్తికేయ మాట్లాడుతూ.. ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు బాగా చదవడం, అబ్జెక్టివ్‌ ఎలిమినేషన్‌ విధానాన్ని అనుసరించడమే తన విజయ రహస్యమని తెలిపాడు. నీట్‌ కూడా బాగా రాశానని, అందులోనూ మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేయడమే లక్ష్యమని తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement