సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్‌కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్‌సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్‌వీఎస్, సీబీఎస్‌ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్ పాలసీ–2020’ని వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్‌ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది.
అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ (ఏవోటీఏ), అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్ ఉండాలని సూచించాయి. ద అమెరికన్ చిరోప్రాక్టీస్ అసోసియేషన్ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది.
మన దేశంలో పరిస్థితి ఇలా..
స్కూల్ బ్యాగ్ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది.
పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు
నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు
లంచ్‌బాక్స్ – 250 గ్రా. నుంచి 1 కిలో
వాటర్ బాటిల్ – 200 గ్రా. నుంచి 1 కిలో
బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో
ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి.
కొత్త విధానంలో పలుసూచనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది.
– బ్యాగ్‌ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి.
– స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలి.
– నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్, కంప్యూటర్, మోరల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి.
– స్కూలు బ్యాగ్ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి.
– ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి.
– పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా టైమ్‌టేబుల్ రూపొందించాలి.
– 1, 2 తరగతులకు ఒకే నోట్ పుస్తకం అమలుచేయాలి.
– 3, 4, 5 తరగతులకు రెండు నోట్ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్‌లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి.
– 6, 7, 8 తరగతుల వారికి లూజ్ పేపర్లలో క్లాస్‌వర్క్ చేసేలా ఫైల్‌ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి.
– పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు.
– స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది.
ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు
స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్ బ్యాగ్ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి.
– ప్రొఫెసర్ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ
ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం
విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్‌డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం.
– డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి
బడిసంచి ఇక తేలిక
Published Sat, Dec 5 2020 3:31 AM | Last Updated on Sat, Dec 5 2020 8:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment