చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ | Dolphin doll teach the lessons | Sakshi
Sakshi News home page

చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ

Published Sat, Aug 3 2019 1:58 AM | Last Updated on Sat, Aug 3 2019 1:58 AM

Dolphin doll teach the lessons - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మామూలు డాల్ఫిన్‌ బొమ్మ కాదండోయ్‌...ఇదో ‘చదివే’ బొమ్మ! దీని పేరు డాల్ఫియో. 6, 7, 8వ తరగతి తెలుగు, ఆంగ్ల పాఠ్య పుస్తకాలను ఇది అనర్గళంగా, ఉచ్ఛారణ లోపాల్లేకుండా చదివేయగలదు!

ఏమిటిది ?
ఇదో టాకింగ్‌ పెన్, మల్టీమీడియా ప్రింట్‌ రీడర్‌. ఇందులో ముందే లోడ్‌ చేసిన ఆడియో ఫైళ్లతో కూడిన మెమొరీ చిప్‌ ఉంటుంది. బ్యాటరీ చార్జింగ్‌ ద్వారా పనిచేసే డాల్ఫియోలో పాఠాలు వినబడేలా ఓ స్పీకర్‌ కూడా ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది..
డాల్ఫియోలో ఒక సెన్సర్‌ ఉంటుంది. దీన్ని పాఠ్య పుస్తకం తాలూకూ బార్‌కోడ్‌లపై ఉంచితే సెన్సర్‌ వాటిని స్కాన్‌ చేసి సంబంధిత ఆడియో ఫైళ్లను యాక్టివేట్‌ చేస్తుంది. పాఠంలోని అక్షరాలపై డాల్ఫియోను కదుపుతూ వెళ్తుంటే వాటిని అది చదువుతూ వెళ్తుంది.

ఎందుకు, ఎవరు తెచ్చారు...?
విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు పాఠశాల విద్యాశాఖ ‘టాకింగ్‌ బుక్స్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యునిసెఫ్‌ సహకారంతో రాష్ట్రంలోని 600 పాఠశాలలకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. పుస్తకాల్లోని పాఠ్యాంశాలపై రీడింగ్‌ డివైస్‌ పెడితే ఆ పాఠ్యాంశాలు వాయిస్‌ రూపంలో విద్యార్థులకు వినిపిస్తాయి. అంతేకాదు బొమ్మలపై పెట్టినా ఆ బొమ్మకు సంబంధించిన కథనాన్ని మొత్తం వివరిస్తుంది. అందుకే వాటికి లైఫ్‌ స్కిల్‌ టాకింగ్‌ బుక్స్‌గా యునిసెఫ్‌ పేరు పెట్టింది.   

ఏయే స్కూళ్లకు? 
డాల్ఫియో బొమ్మలను 417 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ),35 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 37 ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు, ఉట్నూరులోని 111 ఆశ్రమ పాఠశాలలకు అందించనున్నారు.

లాభం ఏమిటి?
బాలికల్లో జీవన నైపుణ్యాలను మెరుగు పరుచడం ద్వారా వారిలో మార్పు తీసుకొచ్చేందుకు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో వంద కథలతో ఈ టాకింగ్‌ పుస్తకాలను యునిసెఫ్‌ పాఠశాలలకు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు యునిసెఫ్‌ ప్రతినిధి సుకన్య సుబ్రమణ్యన్‌ సహకారంతో వీటిని పాఠశాలలకు అందించినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

కథలతో పాఠాలు...
పర్యావరణ సమస్యలు, పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ, బాలికల సమస్యలు, ఆరోగ్యం, పౌష్టికత, బాల కార్మిక, బాలల హక్కులు తదితర అంశాలకు సంబంధించిన పాఠాలను మంచి కథలతో రూపొందించినట్లు విజయ్‌కుమార్‌ వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సులభశైలిలో ఈ కథలు ఉన్నట్లు వెల్లడించారు. 6, 7,8 తరగతులకు చెందిన బాలికలకు వీటితో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వీటి ద్వారా జీవన నైపుణ్యాలతోపాటు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడటం, చదవడం, రావడం నేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతాయని యూనిసెఫ్‌ కన్సల్టెంట్‌ సదానంద్‌ వివరించారు.
 – సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement