బాబు యూకేజీ.. బ్యాగు ఫైవ్‌ కేజీ | School Students Facing Problems With Heavy Weight School bags | Sakshi
Sakshi News home page

వయసుకు మించి.. పుస్తకాల సంచి

Published Mon, Nov 25 2019 10:08 AM | Last Updated on Mon, Nov 25 2019 10:08 AM

School Students Facing Problems With Heavy Weight School bags - Sakshi

బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్‌ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్‌ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్‌ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్‌ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్‌ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్‌కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి.

ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది. ఖాళీ స్కూల్‌ బ్యాగు బరువే కిలో వరకు ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పిల్లలపై పుస్తకాల భారం తగ్గించేందుకు స్కూళ్లలో, తరగతి గదుల్లోనే లాకర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మాత్రమే పిల్లలు తమ వెంట తీసుకెళ్లేలా శ్రద్ధ తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. బరువైన బ్యాగులకు బదులు స్కూల్‌ పిల్లల కోసం తేలికైనవి   అందజేసేందుకు అవకాశం ఉన్నా చాలా పాఠశాలల్లో ఏ ఒక్క నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. శనివారం నగరంలో వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లను ‘సాక్షి’ విజిట్‌ చేసిన సందర్భంగా విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగు చూశాయి.
– సాక్షి, సిటీబ్యూరో/ నెట్‌వర్క్‌ 

సాక్షి,హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి మాధ్య రెండో తరగతి చదువుతోంది. ఆమె స్కూల్‌ బ్యాగు బరువు ఎంతో తెలుసా? 10 కిలోలు. దీంతో ఆమె మేనత్త రోజూ ఆ స్కూల్‌ బ్యాగును మోసుకొస్తోంది. అలాగే 6వ తరగతి చదువుతున్న పూజ స్కూల్‌ బ్యాగు బరువు 8.8 కిలోలు. ఇంత బరువు మోయలేక ఆ బాలిక వెన్నుభాగంలో నొప్పి పుడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి చదువుతున్న నాని స్కూల్‌ బ్యాగు బరువు 8 కిలోలు ఉంది. ప్రతిరోజూ అతడి తల్లి రేఖ కొడుకును వెంటబెట్టుకొని స్కూల్‌ బ్యాగు మోసుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. వీరే కాకుండా ఎల్‌కేజీ చదివే చిన్నారుల బ్యాగులు సైతం 4 నుంచి 5 కేజీల బరువు ఉంటున్నాయి. ఇలా వయసుకు మించిన పుస్తకాల బరువుతో బాల్యం కుంగిపోతోంది. నిండా పదేళ్లు లేని పిల్లలు 10 కిలోలకుపైగా బరువు ఉన్న పుస్తకాల బ్యాగును మోయాల్సి వస్తోంది.

బరువుల బాధలివిగో
⇒ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌– 12లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నాని స్కూల్‌ బ్యాగు బరువు 8 కిలోలు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తల్లి రేఖ ఆ బ్యాగును మోసుకెళ్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని స్కూళ్లలోనూ పుస్తకాల బరువు భారీగానే ఉంది.   
⇒ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 9వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9.5 కిలోలు ఉంది. 10వ తరగతి పిల్లల బ్యాగులు 10 కిలోల నుంచి 12 కిలోల వరకు ఉన్నాయి. ఎక్కువ పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు ఉంటేనే పిల్లలు బాగా చదువుతున్నట్లు భావించే తల్లిదండ్రుల ధోరణితోనూ స్కూల్‌ యాజమాన్యాలు బ్యాగుల బరువు 
పెంచేస్తున్నాయి. 
⇒ కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న లిఖిత్‌ సాయి, 5వ తరగతి చదువుతున్న దినేశ్‌ల బ్యాగుల బరువు 6 కిలోలపైనే. లిఖిత్‌సాయి 6.8 కిలోల బరువు మోస్తుండగా, దినేశ్‌ బ్యాగ్‌ బరువు 7.5 కిలోలు ఉంది. ఈ చిన్నారులు వయసుకు మించిన భారాన్ని మోయకతప్పడంలేదు.    
⇒ లాలాపేట ఇందిరానగర్‌కు చెందిన శివకుమార్‌ నాలుగో తరగతి. పుస్తకాల బ్యాగు బరువు సుమారు 8 కిలోలు. చిలకలగూడకు చెందిన హసినీ 6వ తరగతి. ఆమె బ్యాగు బరువు 12 కిలోలు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఆరు టెస్ట్‌బుక్కులు, ఆరు క్లాస్‌ బుక్కులు, ఆరు వర్క్‌ బుక్కులు, డైరీ, రఫ్‌ నోట్‌బుక్, హోంవర్క్‌ బుక్కులతో కలిపి సుమారు 20 నుంచి 25 పుస్తకాలు స్కూలుకు తీసుకెళ్తున్నారు. వీటితోపాటు టిఫిన్‌ బాక్స్, వాటర్‌బ్యాటిల్‌ బరువుతో కలిపి సుమారు 10 నుంచి 12 కిలోలపైనే ఉంటుంది.

వెల్లడైన వాస్తవాలు..  
ఎల్‌కేజీ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లల పుస్తకాల బ్యాగులను పరిశీలించగా..  సగటున 4 నుంచి 10 కిలోల వరకు ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో 10వ తరగతి పిల్లల బ్యాగులు 10కిలోలపైనే ఉన్నాయి. ‘ఎప్పుడు ఏ సబ్జెక్ట్‌ ఉంటుందో తెలియదు. తరచూ  టైం టేబుల్‌ మారుతూ ఉంటుంది. అందుకోసం అన్ని పుస్తకాలు తెచ్చుకోవలసి వస్తుంద’ని పలువురు విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘స్కూల్‌ మేనేజ్‌మెంట్‌లు సూచించిన ప్రకారంగానే  పిల్లల బ్యాగుల్లో పుస్తకాలను, నోట్‌బుక్స్‌ను పెడుతున్నా’మని తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలో చాలామంది పిల్లలు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

పరిష్కార మార్గాలివీ..  
స్కూల్‌ పిల్లలు మోస్తున్న పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించాలనే ప్రధానమైన లక్ష్యంతో పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్న నాగ్‌పూర్‌నకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజేంద్ర ఇటీవల హైదరాబాద్‌లోనూ పర్యటించారు. ‘నగరంలోని చాలా స్కూళ్లలో పరిశీలించాను. ప్రతి బ్యాగు 7 కిలోలపైనే ఉంది. ఖాళీ బ్యాగే కిలో వరకు ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీన్ని మార్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. స్కూళ్ల యాజమాన్యాలలోనూ మార్పు అవసరం’ అన్నారు ప్రొఫెసర్‌ రాజేంద్ర. స్కూల్‌ బ్యాగు బరువును తగ్గించే పరిష్కార మార్గాలను సైతం ఆయన సూచించారు. అవి ఇలా ఉన్నాయి.. 
⇒  పాఠ్య పుస్తకాలను చిన్న చిన్న బుక్‌లెట్‌లుగా ముద్రించాలి. 16 పాఠాలు ఉన్న పుస్తకాన్ని 4 పాఠాలకు ఒక బుక్‌లెట్‌ చొప్పున ముద్రించవచ్చు. దీంతో అవసరమైన బుక్‌లెట్‌ మాత్రమే తీసుకెళ్లవచ్చు. 
⇒ 200 పేజీల నోట్‌ పుస్తకాలకు బదులు 100 పేజీల నోట్‌ పుస్తకాలను ముద్రించాలి. 
⇒ పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయులు సరైన అవగాహనతో ఉంటే ఎక్కువ పుస్తకాలు తెచ్చుకోవలసిన అవసరం పిల్లలకు ఉండదు. 
⇒ కచ్చితమైన టైమ్‌టేబుల్‌ను పాటించాలి.  
⇒  ప్రతి పాఠ్య పుస్తంపై దాని బరువును సైతం విధిగా ముద్రించాలి. 
⇒  పాఠ్య పుస్తకాలకు, మ్యాప్‌లకు మధ్య సమతుల్యం లేకపోవడంతోనూ పేజీల సంఖ్య పెరిగిపోతోంది. దీనిని నివారించాలి. 
⇒  లాకర్లు ఏ మేరకు ప్రత్యామ్నాయం కాగలవనే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. 
⇒  ఈ– లెర్నింగ్‌ సదుపాయాలను   పెంచాలి. 

చర్యలు తీసుకోవాలి.. 
పుస్తకాల బ్యాగు బరువును తగ్గించాలి. ఏ రోజు ఏ సబ్జెక్ట్‌ బోధిస్తారో దానికి సంబంధించిన పుస్తకాలను మాత్రమే విద్యార్థులు పాఠశాలకు తీసుకువచ్చేలా ఉపాధ్యాయులు సూచించాలి.  దీంతో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గుతుంది.
 –    విద్యారాణి, జిల్లెలగూడ  

వెన్నుపూస నొప్పి
పుస్తకాల బరువుతో విద్యార్థులు వెన్నుపూస నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకిచ్చే హోంట్యూషన్‌ పాఠశాలల్లోనే చేయిస్తే పుస్తకాల భారం తగ్గుతుంది. విద్యాశాఖ అధికారులు స్పందించాల్సిన అవసరముంది.
– లక్ష్మణ్, పేరెంట్, జిల్లెలగూడ   

మోత తప్పడం లేదు..
రోజూ పుస్తకాలు, నోటు పుస్తకాల బరువు మోయాల్సిందే. ఇంకా కొన్నింటిని స్కూల్‌లోనే పెట్టివస్తాం. ఇంటి నుంచి బడి వరకు అక్కడి నుంచి ఇంటి వరకు మోయాల్సి వస్తోంది. ఇంటికెళ్లి హోంవర్క్‌ కూడా చేయాలనిపించడం లేదు. కానీ తప్పదు.
 – నీరజ్, 9వ తరగతి, మదీనాగూడ 

పిల్లలు అలసిపోతున్నారు.. 
తరగతి పెరుగుతున్న కొద్దీ పుస్తకాల బరువు రెండింతలు పెరుగుతోంది. పుస్తకాల బ్యాగును మోయడంతో విద్యార్థులు శారీరకంగా అలసిపోతున్నారు. వెన్నుపూస వంగిపోతోంది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థుల పుస్తకాల బ్యాగుల భారం తగ్గించాల్సిన అవసరం ఉంది.
– మల్లికార్జున్, పేరెంట్, చిలకలగూడ  

బ్యాగుల బరువు తగ్గించాలి. 
స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించాలి. ఇంటి నుంచి నిత్యం కిలోలకొద్ది బ్యాగ్‌ మోసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటోంది. మొదటి తరగతి నుంచి ఇదే విధంగా బరువైన బ్యాగ్‌లను మోయించారు. అన్ని రకాల నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను తీసుకెళ్లాల్సి వస్తుండడంతో వెన్నెముఖ భాగంలో నొప్పి పుడుతోంది.   
– ఆర్‌.దీపక్, 8వ తరగతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement