అభిప్రాయం
క్రమశిక్షణే విద్యార్థికి సంస్కారవంతమైన విద్యను అంది స్తుంది. క్రమశిక్షణే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. అది లోపించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యా యులపై దారుణంగా భౌతిక దాడులకు దిగడం అందులో ఒకటి. రాయచోటి (Rayachoty) పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ‘ఏజాష్ అహ్మద్’ అనే ఉపాధ్యాయునిపై ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులతో భౌతికదాడి చేయడంతో టీచర్ ప్రాణాలు విడిచారు. తన తరగతిలో బోధన చేస్తుండగా, పక్క క్లాసులో అల్లరి చేస్తున్న వారిని టీచర్ మందలించారు. అంతే... కోపోద్రిక్తులై టీచర్‌పై దాడిచేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ సంఘటనలు మరవక ముందే మరో రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్పూర్ జిల్లాలోని ధామోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ‘సురేంద్రకుమార్ సక్సేనా’పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని మందలించడం వలనే జరిగింది.
దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రకరకాల కారణాలతో జరిగాయి. కానీ మూడు – నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే కారణంతో పై సంఘటనలు సంభవించడం బాధా కరం. విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?
పిల్లలు స్వతహాగా సున్నిత హృదయులు. వారి లేలేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇంటిలో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు మెలగాలి. పిల్లలు ఎక్కువ సమయం మిత్రులతో గడుపుతారు. ఈ క్రమంలో సహవాస దోషం వల్ల కొన్ని చెడ్డ అలవాట్లు సంక్రమిస్తాయి. దీన్ని ఎవరైనా వ్యతిరేకించి మందలిస్తే, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకే వారిని అనునయిస్తూ పరిష్కారాలను కనుగొనాలి.
చిన్నతనంలో కుల, లింగ వివక్ష, లైంగిక వేధింపులకు గురి కావొచ్చు. ఇవన్నీ పిల్లల విపరీత ధోరణికి కారణమౌతాయి. టీనేజ్ పిల్లలు రాత్రనక పగలనక స్మార్ట్ ఫోన్‌లలో సామాజిక మాధ్యమాలు చూస్తూ కాలం గడుపుతుంటారు. బెట్టింగ్, రమ్మీ, రేసింగ్ లాంటి ఆటల్లో పాల్గొని డబ్బు పోగొట్టుకుంటారు. దీంతో ప్రతీ విషయానికీ కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటి వల్లనే నేడు విద్యార్థులలో వింత ప్రవర్తన చూస్తున్నాం. ఈ కారణాలతోనే పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, రీల్స్ చూసి నాయికా నాయకులను అనుకరిస్తున్నారు. ఈ రోజుల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులు సైతం ధూమపానం, మద్యం సేవించడం చూస్తున్నాం. ఇవన్నీ పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేవే.
ఒక విద్యార్థిని ‘నీకేమీ రాదు, నీవు దేనికీ పనికి రావు’ అని పది మందిలో తక్కువ చేసి టీచర్ మాట్లాడకూడదు. శారీరకంగా శిక్షించకూడదు. దాన్ని అవమానంగా భావించి కృంగిపోతాడు. గ్రామీణ విద్యార్థులను చులకనగా చూడకూడదు. వీరికి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించకూడదు. వీరికి అవసరమైన పక్షంలో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. స్కూల్‌లో అందరు టీచర్లూ ఐక్యంగా ఉండాలి. పాఠశాలల్లో సహ పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిలో విద్యార్థులను భాగస్వామ్యలుగా చేయాలి. అవసరమైతే పాఠశాలలో సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.
చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం
బడి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను, పత్రికలను పిల్లలు చదివేలా చూడాలి. సైన్స్, సోషల్, మోరల్ క్లబ్బులను నిర్వహించాలి. ప్రపంచీకరణ వల్ల సంక్రమించిన వస్తువుల వల్ల కలిగే నష్టాలను ఎరుక పరచాలి. ప్రభుత్వమైతే విద్యా ప్రణాళికలో మార్పులు చేయవచ్చు. ఆ మార్పులు సామాజిక అంతరాలను నిలువరిస్తూ, మానవత్వాన్ని చాటేలా ఉండాలి. స్ఫూర్తిదాయక, నీతి ప్రబోధక పాఠ్యాంశాలను తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడే విద్యార్థికి విలువలతో కూడిన విద్య అందుతుంది. లేనిచో విద్యార్థుల్లో హింసాప్రవృత్తి పెచ్చు మీరిపోయి, రాబోవు యువతరం నిర్వీర్యయ్యే ప్రమాదం లేకపోలేదు.
- పిల్లా తిరుపతిరావు
తెలుగు ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment