పాఠాలు లేటేనా...!
⇒ఇంకా 10 శాతం కూడా జిల్లాకు రాని పాఠ్యపుస్తకాలు
⇒ సకాలంలో పంపిణీపై సందిగ్ధత
⇒ఆలస్యంతో ఏటా తిప్పలే..
ప్రతి సంవత్సరం లాగానే.. ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉచిత పాఠ్యపుస్తకాలు ఈసారి కూడా సకాలంలో జిల్లాకు వచ్చే అవకాశాలు కనిపించపోవడమే. విద్యాశాఖ అంచనాల మేరకు ఈ సంవత్సరంలో 15 లక్షల పైచిలుకు పుస్తకాలు జిల్లాకు అవసరం కాగా.. కేవలం 80 వేలు మాత్రమే ఇప్పటి వరకు అందాయి. గతేడాది పుస్తకాలు ఆలస్యం కావడం వల్ల పాఠ్యాంశాలు డిసెంబర్ నాటికి పూర్తి కాలేదు. ఈసారైనా పుస్తకాలు సమయానికి వస్తాయో..? రావో..? అన్న సందిగ్ధం నెలకొంది.
తిరుపతి ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈఏడాది కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే సూచనలు కనిపించడం లేదు. తరగతులు, మీడియంల వారీగా జిల్లాకు ఈ ఏడాది 15 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 80 వేల బుక్స్ మాత్రమే అందాయి. ఇంకా 14 లక్షలకుపైబడి పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉండడంతో ఎదురుచూపులు తప్పలేదు.
సరఫరా ఇలా..
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. దీనికోసం వేసవి సెలవులకు ముందస్తుగానే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో అన్న అంచనాలతో జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల అచ్చుకు ప్రభుత్వం టెండర్‌ను పిలిచి ప్రింటింగ్ ప్రెస్‌కు కేటాయిస్తుంది. ప్రింటింగ్ అయిన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీటిని జిల్లాలోని 66మండలాల్లో ఉన్న మండల వనరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలలు పునఃప్రారంభం(జూన్ 13వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ.
విద్యాశాఖ నివేదిక ఇలా..
జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఉర్దు మీడియం పాఠశాలలున్నాయి. దీనికితోడు సంస్కృత మీడియం పాఠశాలలు ఒకట్రెండు ఉన్నట్టు సమాచారం. అన్ని తరగతులు, మీడియాలకు సంబంధించి జిల్లాకు మొత్తం 18,55,583 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. గత ఏడాది పుస్తక విక్రయ కేంద్రంలో 3,25,571పాఠ్యపుస్తకాలు మిగులులో ఉన్నాయి. ఇవి పోను 15,30,012పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యాశాఖ నివేదిక పంపింది. అయితే ఇప్పటి వరకు 9వ తరగతి తెలుగు మీడియానికి సంబంధించిన బయాలజి, ఫిజిక్స్, 8వ తరగతికి సంబంధించి తెలుగు రీడర్, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ బుక్స్ సహా మొత్తం 79,627 పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 14,50,385 పాఠ్యపుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. అనుకున్న తేదీలోపు దశల వారీగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయనిని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో సకాలంలో పంపిణీపై సందిగ్ధత నెలకొంది.
ప్రతియేటా ఇబ్బందులే..
పాఠశాలల పునఃప్రారంభంలోపే పుస్తకాలను చేరవేస్తామని ప్రభుత్వం ఏటా ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా గత ఏడాది నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యాబోధన అందించాలంటే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు ఉండి తీరాలి. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరిగితేనే డిసెంబరు ఆఖరుకల్లా పాఠ్యాంశాలను పూర్తి చేసి రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా జరగాలంటే పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.