
ముందుగానే పాఠ్యపుస్తకాల రాక
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఈసారి ముందుగానే జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాకు 80 శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. జిల్లా గోదాం నుంచి సోమవారం వరకు 51 మండలాలకు 70 శాతం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లాకు 27,41,000 పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ సంబంధిత ఉన్నతాధికారులకు ప్రతిపాదించింది.
అందులో ఇప్పటివరకు 24 లక్షల 54వేల 9 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంనకు చేరుకున్నాయి. వీటిలో 21,87,845 పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను రవాణా చేయడానికి జిల్లా విద్యాశాఖ టెండర్లు ఆహ్వానిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రవాణా బాధ్యతలను ఎంఈఓలకే అప్పగించారు. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి మండల విద్యాశాఖాధికారులు రెండు దశలుగా ఇప్పటికే ఎంఆర్‌సీ భవనాలకు పుస్తకాలు తరలించారు.
మూడో దశలో కూడా పుస్తకాలను తీసుకెళ్తున్నారు. ఎంఆర్‌సీ భవనాల నుంచి పాఠశాలల హెచ్‌ఎంలు పాఠ్యపుస్తకాలను తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. రవాణాకు సంబంధించిన వ్యయాన్ని జిల్లా విద్యాశాఖ చెల్లించనుంది. మిగిలిన పుస్తకాలు కూడా కొద్దిరోజుల్లోనే రానున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 123 టైటిల్ పాఠ్యపుస్తకాల్లో 122 టైటిల్స్ వచ్చాయి. కేవలం ఉర్దూ మీడి యానికి సంబంధించిన ఒక టైటిల్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఏది ఏమైనా వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులు నిరీక్షించనవ సరం లేదు.
6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రేపే అందించాలి..
6,7,8,9,10 తరగతుల విద్యార్థులకు విద్యాసంవత్సరం ముగింపు రోజు బుధవారం పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఎంఈఓలను ఆదేశించారు. మండల కేంద్రాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను హెడ్మాస్టర్లు తమ స్కూల్ పాయింట్లకు తీసుకెళ్లి విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో విద్యార్థులు వేసవిలో ఇంటివద్ద చదువుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మాత్రం జూన్ 12న అందించాలని ఆదేశాలు అందాయి.