సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మొదలైంది. ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నా, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే పనిలో విద్యా శాఖ నిమగ్నమైంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం. అందులో 1.12 కోట్ల పుస్తకాలు జిల్లాలకు పంపినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 30 లక్షల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. రాజమండ్రి నుంచి పుస్తకాలకు అవసరమైన పేపర్ హైదరాబాద్‌కు రాకపోవడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైందని పాఠశాల విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పేపర్ తెప్పించి నెలాఖరులోగా ముద్రించి జిల్లాలకు పంపుతామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలకు పంపించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరినట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలలకు రావట్లేదు. దీంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. 9, 10వ తరగతి విద్యార్థులందరికీ వేగంగా పుస్తకాలు అందజేయాలని కోరింది. దీంతో కొన్నిచోట్ల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లకు 1.25 కోట్ల పుస్తకాలు..
ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారమే పుస్తకాల ముద్రణ చేస్తారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 32 లక్షల మంది ఉంటారు. వారికోసం 1.25 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. వాటిని ప్రైవేట్ ముద్రణా సంస్థలు సిద్ధం చేస్తాయి. ఆరు శాతం రాయల్టీతో ముద్రణా సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఆ రూపేణా ప్రభుత్వానికి ఈ ఏడాది దాదాపు రూ.4 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రైవేట్ స్కూళ్లు పుస్తకాలను ఆయా ముద్రణా సంస్థల వద్ద నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తాయి. అయితే ఈసారి చాలా స్కూళ్లు పూర్తిస్థాయిలో పుస్తకాలు కొనట్లేదని ముద్రణా సంస్థలు చెబుతున్నాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే వింటుండటంతో చాలామంది స్కూళ్లకు వచ్చి కొనుగోలు చేయట్లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు తప్ప మిగిలిన వారు అంతగా ఆసక్తి చూపించట్లేదు. తమ పాఠశాలలో ఇంకా పుస్తకాలు రాలేదని ఓ ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బి.సహన చెబుతోంది.
జిల్లాలకు 1.12 కోట్ల పాఠ్య పుస్తకాలు
Published Fri, Jul 23 2021 1:44 AM | Last Updated on Fri, Jul 23 2021 1:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment