Public school students
-
పేద విద్యార్థులపై ట్రోల్స్ చేస్తే తాట తీస్తాం
గుడివాడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ గుక్క తిప్పుకోకుండా ఇంగ్లిష్ మాట్లాడుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెడుతున్న వారి తాటతీస్తామని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటూ విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌ని సైతం అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అందరికీ ఆదర్శంగా నిలవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను స్వయంగా సీఎం కార్యాలయానికి రప్పించి అభినందించారని వివరించారు. అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చక్కగా చదువుకోవాలని సీఎం పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అటువంటి విద్యార్థులపై కొంతమంది ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల ఆధారంగా విమర్శిస్తూ పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేద విద్యార్థులు అంటే అంత అలుసా అని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ట్రోల్స్ పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి, పేదవాళ్ల మీద జోకులు వేస్తూ అవహేళనగా ప్రవర్తిస్తే అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం
సాక్షి, అమరావతి: ఆర్జీయూకేటీ సెట్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10,389 ర్యాంకులు సాధించగా.. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు 9,611 ర్యాంకులు వచ్చాయి. 1 నుంచి 5వేల వరకు ర్యాంకుల్లో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. మొత్తంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. 1–1,000 ర్యాంకుల్లో 116 ర్యాంకులతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 92 ర్యాంకులతో ద్వితీయ స్థానంలో వైఎస్సార్ జిల్లా నిలిచింది. మొత్తం 20 వేల ర్యాంకుల్లో అత్యధికంగా 1,888 ర్యాంకులతో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. 1,793 ర్యాంకులతో వైఎస్సార్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అత్యధికంగా 11,677 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఓసీలు 3,725 మంది, ఎస్సీలు 1,889 మంది, ఎస్టీలు 363 మంది ఎంపికయ్యారు. వీరు కాకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి వచ్చే విద్యార్థులు 2,346 మంది ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా
ఒంగోలు మెట్రో: రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) సెట్– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్ వెలువరించి, సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే లక్ష్యం రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే నా ముందున్న లక్ష్యం. – మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్ కలెక్టర్‌గా చూడాలని అమ్మానాన్న కోరిక 2వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. – కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్ ఇంజనీరింగ్ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతా ఇంజనీరింగ్ (సీఈసీ) చదువుతూ సివిల్స్‌కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్జీయూకేటీ సెట్–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. – మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు -
8 లక్షల మంది చదువులకు దూరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కరోనా కారణంగా ప్రత్యక్ష విద్యా బోధన లేకుండానే గత విద్యా సంవత్సరం గడిచిపోగా.. ఈసారి విద్యా సంవత్సరం మొదలై నెల దాటినా అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యాశాఖ తేల్చిన అధికారిక లెక్కల ప్రకారమే.. 72 వేల మంది విద్యార్థులకు టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివేవీ లేవు. ఈ సదుపాయం ఉన్నా వివిధ సమస్యల కారణంగా మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదు. ఒకటి రెండు తరగతుల విద్యార్థులు 3 లక్షల మందికి ఎలాంటి తరగతులూ నిర్వహించడం లేదు. ఏదో ఒక సమస్యతో.. ►రాష్ట్రంలో గురుకులాలు మినహా 27,257 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 18,43,589 మంది చదువుతున్నారు. కరోనా కారణంగా బడులు తెరవకపోవడంతో విద్యాశాఖ డిజిటల్ బోధన ప్రారంభించింది. రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (సైట్) గతేడాది రూపొందించిన వీడియో పాఠాలనే టీ–శాట్, దూరదర్శన్ (యాదగిరి) చానెళ్ల ద్వారా ప్రసారం చేస్తోంది. ఇదికూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే. ఒకటో, రెండో తరగతి విద్యార్థుల విషయాన్నే పక్కన పెట్టేసింది. దీంతో 3 లక్షల మంది చదువుకు దూరమయ్యారు. ►3–10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్లో 1,00,459 మం దికి డిజిటల్ పాఠాలు వినేందుకు అవసరమైన టీవీలు లేవు. ఇందులో సుమారు 27,257 మందికి గ్రామ పంచాయతీల్లో టీవీ చూసే ఏర్పాటు చేసింది. ఇందులోనూ 10 వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. అంటే మిగతా 90 వేల మంది చదువులకు దూరమయ్యారు. ►ఇక ఇంటర్నెట్ సదుపాయం లేక, టీవీలో పాఠాలు ఎప్పుడు వస్తాయో తెలియక, ఆన్లైన్ క్లాసులు అర్థంకాక మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదని అంచనా. ►మరోవైపు ఇప్పటికే ఏపీ, యూపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి. మన రాష్ట్రంలోనూ ప్రత్యక్ష బోధన చేపట్టాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. -
జిల్లాలకు 1.12 కోట్ల పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ మొదలైంది. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నా, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే పనిలో విద్యా శాఖ నిమగ్నమైంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం. అందులో 1.12 కోట్ల పుస్తకాలు జిల్లాలకు పంపినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 30 లక్షల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. రాజమండ్రి నుంచి పుస్తకాలకు అవసరమైన పేపర్ హైదరాబాద్‌కు రాకపోవడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైందని పాఠశాల విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పేపర్ తెప్పించి నెలాఖరులోగా ముద్రించి జిల్లాలకు పంపుతామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలకు పంపించిన పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరినట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలలకు రావట్లేదు. దీంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. 9, 10వ తరగతి విద్యార్థులందరికీ వేగంగా పుస్తకాలు అందజేయాలని కోరింది. దీంతో కొన్నిచోట్ల టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు 1.25 కోట్ల పుస్తకాలు.. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రకారమే పుస్తకాల ముద్రణ చేస్తారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 32 లక్షల మంది ఉంటారు. వారికోసం 1.25 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయి. వాటిని ప్రైవేట్ ముద్రణా సంస్థలు సిద్ధం చేస్తాయి. ఆరు శాతం రాయల్టీతో ముద్రణా సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఆ రూపేణా ప్రభుత్వానికి ఈ ఏడాది దాదాపు రూ.4 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రైవేట్ స్కూళ్లు పుస్తకాలను ఆయా ముద్రణా సంస్థల వద్ద నిర్ణీత ధరకు కొనుగోలు చేస్తాయి. అయితే ఈసారి చాలా స్కూళ్లు పూర్తిస్థాయిలో పుస్తకాలు కొనట్లేదని ముద్రణా సంస్థలు చెబుతున్నాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే వింటుండటంతో చాలామంది స్కూళ్లకు వచ్చి కొనుగోలు చేయట్లేదు. 9, 10 తరగతుల విద్యార్థులు తప్ప మిగిలిన వారు అంతగా ఆసక్తి చూపించట్లేదు. తమ పాఠశాలలో ఇంకా పుస్తకాలు రాలేదని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బి.సహన చెబుతోంది. -
రేపే జగనన్న విద్యా కానుక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను ముఖ్యమంత్రి జగన్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సూచనల మేరకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు అందచేసే వస్తువుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రే స్వయంగా అన్నిటినీ పరిశీలించి ఆమోదించడం విశేషం. 42.34 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్ కిట్లు’ అందచేస్తారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు. కిట్ల పంపిణీ ఇలా... రోజూ 50 మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, సంరక్షకులతో కలసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందచేయాలి. కిట్ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్, ఐరిష్ ద్వారా హాజరు నమోదు చేయాలి. కిట్లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందచేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజువి లేకపోయినా, లోపాలు ఉన్నట్లు గుర్తించినా అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలి. యూడైస్ కోడ్ , చైల్డ్ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు. జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. (చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ) -
తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం
-
ఏ మీడియం కావాలో చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా 2020–21 విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అనంతరం ప్రతి ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ నాలుగేళ్లలో పదవ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలను ఇంగ్లిష్ మీడియంలో రాసేలా తీర్చిదిద్దాలని భావించింది. ► ఇదే సమయంలో అన్ని పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కూడా చేసింది. ఈ మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఓ తెలుగు మీడియం పాఠశాల కొనసాగించాలని నిర్ణయించింది. ► కాగా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో కేసు వేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. -
నాణ్యమైన భోజనం అందించాలి
పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ డివిజన్ డిప్యూటీ డీఈఓ లింబాజీ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరుశాతం, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈనెల 17న ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ స్పందించి వివరాలు సేకరించారు. వారంలో మూడు రోజులపాటు గుడ్లను అందించాలన్నారు. తనిఖీ సమయంలో ఎంఈఓ పోచయ్య, హెచ్ఎం రాజేశ్వర్, ఉపాధ్యాయులు చంద్రయ్య, రఘునాథ్‌రావు, విఠల్ తదితరులున్నారు. చిన్నశంకరంపేట: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని చిన్నశంకరంపేట ఎంఈఓ బాల్‌చంద్రం తెలిపారు. సోమవారం మండలంలోని మల్లుపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో మెను పాటించేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎంఈఓ సందర్శించిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్, ఉపాధ్యాయురాలు స్వప్న ఉన్నారు.