ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా | Government students Tops in IIIT results | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా

Published Thu, Oct 7 2021 3:15 AM | Last Updated on Thu, Oct 7 2021 7:16 AM

Government students Tops in IIIT results - Sakshi

ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు

ఒంగోలు మెట్రో: రాజీవ్‌ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జేయూకేటీ) సెట్‌– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఆర్‌జేయూకేటీ వైస్‌ చాన్సలర్‌ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్‌ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్‌ వెలువరించి, సెప్టెంబర్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్‌ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు.

ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ కావడమే లక్ష్యం
రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్‌ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్‌ ఇంజనీర్‌ కావడమే నా ముందున్న లక్ష్యం.    
– మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్‌

కలెక్టర్‌గా చూడాలని అమ్మానాన్న కోరిక
2వ ర్యాంక్‌ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. 
– కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్‌

ఇంజనీరింగ్‌ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతా
ఇంజనీరింగ్‌ (సీఈసీ) చదువుతూ సివిల్స్‌కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్‌జీయూకేటీ సెట్‌–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. 
– మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement