సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారంలో తప్పిదాలు జరిగినట్లు విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. లెక్చరర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేయకున్నా.. వాటిని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లకు తూట్లు పొడిచినట్లు విచారణ కమిటీ పేర్కొంది. ఇంటర్వ్యూ మార్కులను కేటాయించిన తరువాత వాటిని దిద్ది తప్పిదాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది చేపట్టిన 246 పోస్టుల భర్తీ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో ప్రభుత్వం కల్పించుకొని ఇంటర్వ్యూలు పూర్తయిన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేసింది. అవకతవకలపై గత ఏడాది అక్టోబరు 26న విచారణకు ఆదేశించింది. మాజీ వైస్ ఛాన్స్‌లర్లు సీఆర్ విశ్వేశ్వరరావు, తిరుమలరావు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ విజయప్రకాష్‌లతో కూడిన కమిటీ పోస్టుల భర్తీ వ్యవహారంపై విచారణ జరిపి ఫిబ్రవరి మొదటివారంలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
నివేదికలో పేర్కొన్న పలు తప్పిదాలు
ఆర్‌జీయూకేటీలో ఆధ్వర్యంలోని మూడు ట్రిపుల్ ఐటీల్లో బోధన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. అందులో 118 అసిస్టెంట్ ప్రొఫెసర్, 118 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల పోస్టులకు వేతనాలు ఒకటైనా సర్వీసు రూల్స్ వేరు. దీంతో ఆ 118 లెక్చరర్ పోస్టులను కూ డా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పు చేయమని (కన్వర్ట్) ప్రభుత్వానికి రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే వాటిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది.
ఇంటర్వ్యూల్లో మార్కులు వేసిన తరువాత 90 శాతం అభ్యర్థులకు మార్కుల షీట్ల విషయంలో తప్పులు జరిగాయి. మొదట వేసిన మార్కులను తరువాత దిద్దారు.
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో ఓసీ మహిళకు వచ్చిన మార్కుల ప్రకారం ఆమె ఓసీ జనరల్ కేటగిరీలో ఎంపిక చేయాలి. కాని ఆమెను ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఒక ఎస్సీ అభ్యర్థి విషయంలోనూ అలాగే చేశారు.
మెకానికల్ ఇంజనీరింగ్‌లోనూ ఓసీ మహిళను మెరిట్ ప్రకారం ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సి ఉండగా, ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సిన బీసీ-డీ అభ్యర్థిని రిజర్వేషన్‌లో ఎంపిక చేశారు.
ఈఈఈ సబ్జెక్టులోనూ ఓసీ మహిళ విషయంలో అలాగే చేశారు. రోస్టర్ పాయింట్స్‌లో తేడాలు చూపారు.
ఈసీఈలో ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సిన ఎస్సీ అభ్యర్థిని రిజర్వేషన్‌లో ఎంపిక చేశారు.
పోస్టు కోసం కడపలోని ఆర్‌కే వ్యాలీ అప్షన్ ఇవ్వకపోయినా ఒకరిని అక్కడి పోస్టింగ్ జాబితాలో చేర్చారు.