రేపే జగనన్న విద్యా కానుక | CM YS Jaganmohan Reddy will formally inaugurate Jagananna Vidya Kanuka Program on 8th | Sakshi
Sakshi News home page

రేపే జగనన్న విద్యా కానుక

Published Wed, Oct 7 2020 3:45 AM | Last Updated on Wed, Oct 7 2020 8:46 AM

CM YS Jaganmohan Reddy will formally inaugurate Jagananna Vidya Kanuka Program on 8th - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హైస్కూలులో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను ముఖ్యమంత్రి జగన్‌ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సూచనల మేరకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పిల్లలంతా పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతోపాటు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు అందచేసే వస్తువుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రే స్వయంగా అన్నిటినీ పరిశీలించి ఆమోదించడం విశేషం. 

42.34 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ అందచేస్తారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్‌  కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు.

కిట్ల పంపిణీ ఇలా...
రోజూ 50 మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, సంరక్షకులతో కలసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందచేయాలి. కిట్‌ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్, ఐరిష్‌ ద్వారా హాజరు నమోదు చేయాలి. కిట్‌లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందచేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజువి లేకపోయినా, లోపాలు ఉన్నట్లు గుర్తించినా అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలి. 

యూడైస్‌ కోడ్‌ , చైల్డ్‌ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు. జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. (చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో పాఠ్యపుస్తకాల పంపిణీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement